250 ఎద్దులు, 300 మంది యువకులు బరిలోకి..
సేలం(చెన్నై): రాష్ట్రంలో గత జనవరిలో జల్లికట్టుపై నిషేధం విధించిన సమయంలో నామక్కల్ జిల్లాలోని కుమారపాళయం ప్రాంత ప్రజలు 5వేల మందికి పైగా ఆరు రోజులపాటు ఆందోళనలు చేపట్టారు. తర్వాత కేంద్రప్రభుత్వం జల్లికట్టుపై నిషేధాన్ని తొలగించింది. దీంతో జల్లికట్టు నిర్వహణకు అనుమతి లభించడంతో రాష్ట్ర వ్యాప్తంగా జల్లికట్టు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా కుమారపాళయంలో కూడా జల్లికట్టు నిర్వహణకు హైకోర్టులో అనుమతి పొంది, జిల్లా నిర్వాహకుల సమ్మతంతో శనివారం కుమారపాళయం సమీపంలో ఉన్న వళయాగనూర్ గ్రామంలో జల్లికట్టు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను నామక్కల్ జిల్లా కలెక్టర్ మాయం ఆసియా అధ్యక్షత వహించారు. ఇందులో విద్యుత్ శాఖ మంత్రి తంగమణి, సమాజ సంక్షేమ శాఖ మంత్రి సరోజ పాల్గొని జల్లికట్టు పోటీలను జెండా ఊపి ప్రారంభించారు.
ఈ పోటీల్లో దిండుగల్, మదురై, నామక్కల్, సేలం అంటూ చుట్టుపక్కల పలు ప్రాంతాలకు చెందిన 250 ఎద్దులు బరిలోకి దిగాయి. 300 మందికి యువకులు పాల్గొని సాహసోపేతంగా ఎద్దులను లొంగదీసుకున్నారు. గెలుపొందిన వీరులకు ఫోన్, టేబుల్, మిక్సీ, గ్రైండర్ వంటి పలు బహుమతులను అందజేశారు. యువకుల పట్టుకు చిక్కని ఎద్దుల యజమానులకు రూ. 10 వేలు బహుమతిగా అందజేశారు. ఎద్దులను పట్టిన వీరుల్లో ఐదుగురికి స్వల్పంగా గాయాలయ్యాయి. జల్లికట్టు పోటీల ప్రదర్శన కారణంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.