kunbhamela
-
కుంభమేళలో భారీగా కరోనా కేసులు!
లక్నో: కుంభమేళాలో కరోనా కేసులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ఏప్రిల్ 10 నుండి 14 తేదీల మధ్య కాలంలో 2,36,751 మందిని పరీక్షించగా.. 1,701 మంది కరోనా బారిన పడ్డారు. అయితే మరిన్ని ఆర్టీపీసీఆర్ నివేదికలు రావాల్సి ఉంది. ఈనేపథ్యంలో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గంగానది తీరాన నిర్వహించే కుంభమేళా ఏప్రిల్ 1 నుండి ఈనెల 30వ తేది వరకు జరుగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే, ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికేట్ ఉన్న యాత్రికులకు మాత్రమే పవిత్ర స్నానాలకు అనుమతిస్తున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా ఏప్రిల్ 12,14,27 తేదిల్లో షాహీస్నాన్ నిర్వహిస్తారు. ఈ రోజుల్లో భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరిస్తారు. గత 12 వ తేదినాటి షాహీస్నాన్ కార్యక్రమం వలన భక్తులు పెద్ద ఎత్తున కరోనా బారిన పడ్డారని ఉత్తరఖండ్ ప్రభుత్వం భావిస్తుంది. కాగా, కుంభమేళ 670 హెక్టార్లలో హరిద్వార్, టెహ్రీ, డెహ్రాడూన్ జిల్లాలలో విస్తరించి ఉంది. ఏప్రిల్ 12న సోమవతి అమావాస్య సందర్భంగా జరిగిన షాహిస్నాన్‌లో పాల్గొన్న 48.51 లక్షల మందిలో చాలా మంది కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, అక్కడ ప్రభుత్వం, వైద్య సిబ్బంది, పారామిలటరీ సిబ్బంది, కరోనా నిబంధనలు పాటించేలా.. భక్తులకు వారికి కేటాయించిన స్లాట్ సమయాల్లోనే పవిత్ర స్నానాలను ముగించుకొవాల్సిందిగా ఆదేశాలను జారీ చేసింది. అయినప్పటికి చాలా మంది కోవిడ్ నిబంధనలు పాటించడంలేదు. దీనితో రానున్న రోజుల్లో మరిన్ని కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని ఉత్తరఖండ్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది. -
కుంభమేళాలో తప్పిపోయిన కుర్రాడా!
కుళాయి తిప్పితే జలజల రాలేది కవిత్వం కాదు. అవి పైపుల్లోని నీళ్లు మాత్రమే. ఆత్మ మెలిదిరిగినపుడు, నరాలను పిండినప్పుడు, కాలిగోరు నుంచి పాములా పాకుతూ, కంటి నుంచి రాలే నిశ్శబ్దపు కన్నీటిబొట్టే కవిత్వం. ‘జీరోడిగ్రీ’లో ఆ కన్నీళ్లు గడ్డకట్టుకుపోయి అక్షరాలైనాయి. కవిత్వపు చక్కదనం, కన్నీటి చిక్కదనం తెలిసినవాడు మోహన్ రుషి. మోహన్ కొత్తగా ఏమీ చెప్పలేదు. అన్నీ మనకు తెలుసు. తెలిసినా గుర్తించం. గుర్తించినా అంగీకరించం, అంగీకరించినా మన లోపలి అరల్లో భద్రంగా దాస్తాం. ఆ రహస్యపు గాజుపెట్టెను అతను పగులగొట్టాడు. గాయపడ్డాడు, కట్టు కట్టుకోవడం తెలియనివాడు, కనికట్టు ఎరుగనివాడు. కుంభమేళాలో తప్పిపోయిన కుర్రాడు మోహన్ రుషి. మేళా మనల్ని అబ్బురపరుస్తుంది, భయపెడుతుంది. తప్పిపోయిన చాలామంది ఇళ్లు చేరుకోరు. వాళ్లకోసం ఎవరో వెతుకుతుంటారు. వాళ్లు ఇంకెవరినో వెతుకుతుంటారు. వెతకడంలోనే కొందరు బతుకును ముగిస్తారు. ఈ కవిత్వం అందరికీ ఒకేలా అర్థం కాకపోవచ్చు. అసలు అర్థమే కాకపోవచ్చు. ఇఫ్స్ అండ్ బట్స్‌తో సముదాయించుకోవాలని చూస్తే పెద్దగా వొరిగేది కూడా ఉండదు. ఒక పల్లెటూరి అబ్బాయి నగరానికొచ్చి తన ముఖాన్ని పోగొట్టుకున్నప్పుడు కలిగే బాధ ఈ కవిత్వం. కూలిన రాజ్యాలను పునర్నిర్మించొచ్చేమో కానీ, చెదిరిన ఆ పిచ్చుక గూడుని ఏ గడ్డిపోచలతోనూ తిరిగి కట్టలేరని అంటాడు మోహన్. ఈ ప్రపంచంలో చాలామంది పైకి మనుషులు, లోపల ‘గొల్లుంలు’. గొల్లుం అంటే మనిషి కాదు. జంతువు కాదు. వినయంగా ఉంటూ వంకీ కత్తితో పొడుస్తాడు. నవ్వుతూ రక్తం తాగుతాడు. పసితనంలోనే వృద్ధుడు (లార్డ్ ఆఫ్ ద రింగ్స్ పుస్తకంలో ఒక పాత్ర పేరు గొల్లుం). బ్రాండెడ్ బట్టల ముసుగులో ఈ జంతువులు ఎక్కువై లైఫ్‌స్కిల్స్‌కి సానపెడుతూ మనుషుల్ని పీక్కుతింటున్నాయి. వేటగాళ్లని వేటాడితే తప్ప, బతకలేని నగరంలో తెగిపోయిన పతంగుల్ని ఎగరేసే ప్రయత్నంలో ఉన్నవాడు మోహన్. ఈ పుస్తకాన్ని అమ్మకి అంకితమిచ్చాడు. ‘లోకం మెచ్చని నా బతుకుని లోకంగా చేసుకున్న అమ్మ రాజమల్లమ్మకు’ అన్నాడు. ఈ వాక్యమే అతి గొప్ప ఆర్ట్ పీస్. - జి.ఆర్.మహర్షి