తల్లిదండ్రుల కళ్లెదుటే ఆరెస్సెస్ కార్యకర్త హత్య!
తిరువనంతపురం: ఆరెస్సెస్-సీపీఎం వర్గ కక్షలతో అట్టుడికే కేరళలోని కన్నూర్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆరెస్సెస్ కార్యకర్త ఒకరిని అతని తల్లిదండ్రుల కళ్ల ముందే హత్య చేసిన ఘటనతో ఇక్కడ వర్గపోరు మళ్లీ తెరపైకి వచ్చింది. ఇరువర్గాల మధ్య మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వర్గపోరుకు తెరదించేందుకు చర్చలు జరుపాలని ఇటీవలే ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆరెస్సెస్ కార్యకర్త సోమవారం రాత్రి హత్యకు గురికావడం స్థానికంగా టెన్షన్ క్రియేట్ చేసింది.
సోమవారం రాత్రి ఆరెస్సెస్ కార్యకర్త అయిన 27 ఏళ్ల సుజిత్ ఇంట్లోకి ప్రవేశించి దుండగులు అతన్ని కొట్టిచంపారు. సుజిత్ తల్లిదండ్రులు ఈ దారుణాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో వారిపై కూడా దుండగులు దాడిచేశారు. ఈ ఘటనలో సుజిత్ తల్లిదండ్రులకు స్వల్పగాయాలయ్యాయి. ఈ హత్యకు పాల్పడిన దుండగులు సీపీఎంకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనను నిరసిస్తూ కన్నూర్ జిల్లాలో ఆరెస్సెస్ బంద్‌కు పిలుపునిచ్చింది. పోలీసులు ఎనిమిది మంది సీపీఎం మద్దతుదారులను అరెస్టు చేశారు. జిల్లాలో ఉన్న శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టడానికి సీపీఎం ప్రయత్నిస్తున్నదని బీజేపీ-ఆరెస్సెస్ ఆరోపించాయి. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు కొడియెరి బాలకృష్ణన్ స్పందిస్తూ.. ఇది రాజకీయ హత్య కాదని, స్థానిక గొడవలే ఈ హత్యకు దారితీసినట్టు తెలుస్తున్నదని చెప్పారు.