Kurdish rebels
-
టర్కీలో ఆత్మాహుతి దాడి
టర్కీలో కుర్దిష్ రెబల్స్ శుక్రవారం ఆత్మాహుతి దాడి చేశారు, ఈ దాడిలో 11 మంది పోలీసులు మరణించగా, 78 మంది ప్రజలు గాయపడ్డారు. తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో దాదాపు పోలీస్ హెడ్‌క్వార్టర్స్ మొత్తం ధ్వంసమయింది. దాడి జరిగిన ప్రాంతం సిరియా సరిహద్దుకి అత్యంత సమీపంలో ఉంది. పేలుడు పదార్థాలతో కూడిన ఓ ట్రక్కు ఉదయం 6:45 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) భవనంలోకి వచ్చి పేలిపోయింది. ఆరోగ్య శాఖ మంత్రి రెకెప్ అక్డాగ్ మాట్లాడుతూ గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఐసిస్, కుర్దిష్ రెబల్స్‌కు వ్యతిరేకంగా టర్కీ సిరియాలో చేపట్టిన మూడు రోజుల ఆపరేషన్ ముగిసిన కొన్ని గంటల్లోనే ఈ దాడి జరిగింది. పోలీస్ హెడ్‌క్వార్టర్స్ పక్కన ఉన్న భవనాలు కూడా ధ్వంసమయ్యాయి. భవనానికి 50 మీటర్ల దూరంలో బాంబు పేలిందని టర్కీ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ ఉగ్రవాద సంస్థ టర్కీ భద్రతా బలగాలపై ప్రతీరోజూ ఏదో ఒక దాడి చేస్తూనే ఉంటుంది. టర్కీ శుక్రవారం కూడా మరో నాలుగు ట్యాంకర్లను సిరియా భూభాగంలోకి పంపింది. కుర్దిష్ రెబల్స్ టర్కీ ప్రభుత్వం ఐసిస్ తీవ్రవాదాన్ని అరికట్టడం కంటే తమని దేశంలోకి రానివ్వకుండా చేయటానికే చర్యలు ఎక్కువగా తీసుకుంటుందని ఆరోపిస్తున్నారు. అయితే టర్కీ ప్రధాని బినాలీ యిదిరిం పాశ్చాత్య మీడియా సిరియా ఆపరేషన్ విషయంలో ఎలాంటి నిజాలూ తెలుసుకోకుండా ఇష్టమొచ్చినట్లు రాస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
'ప్రెస్ కాన్పరెన్స్లోనే కాల్చి చంపారు'
టర్కీ: టర్కీలో ఓ ముఖ్యమైన న్యాయవాది, మానవహక్కుల కార్యకర్త హత్యకు గురయ్యాడు. విలేకరుల సమావేశం నిర్వహిస్తుండగానే ఆ న్యాయవాదిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి చంపేశారు. ఈ క్రమంలో పోలీసులకు, ఓ జర్నలిస్టుకు కూడా గాయాలయ్యాయి. తాహిర్ ఎల్సి అనే న్యాయవాది ఖుర్దిష్ తిరుగుబాటుదారులకు మద్దతుదారు. దీంతో ఆయనపై క్రిమినల్ అభియోగాలు కూడా ఉన్నాయి. శనివారం ఏదో అంశంపై తోటి న్యాయవాదులతోకలిసి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అకస్మాత్తుగా వచ్చి ఈ దాడికి దిగారు. అయితే, ఈ దాడి ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. తాహిర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండటంతోపాటు ఖుర్దిష్ నగరంలోని ప్రముఖ హక్కుల కార్యకర్తగా కూడా పనిచేస్తున్నారు. -
బాంబు దాడిలో 12 మంది పోలీసుల మృతి
అంకారా: ఓ మినిబస్సుపై జరిగిన బాంబు దాడిలో సుమారు 12 మంది పోలీసులు మృతిచెందగా, మరికొంత మంది గాయపడ్డారు. ఈ ఘటన తూర్పు టర్కీలో చోటుచేసుకుంది. కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ వర్గం వారే ఇందుకు బాధ్యులని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఇగ్డిర్ ప్రాంతంలో దిలుకు సరిహద్దు గేటు వద్ద మినిబస్సుపై బాంబు దాడులు జరిగినట్లు సమాచారం. అజర్బైజాన్ సరిహద్దు సమీపంలో కుర్దిష్ మిలిటెంట్లు జరిపిన దాడిలో 12 మంది పోలీసులు మృతిచెందారు. దీని నుంచి తేరుకున్న పోలీసులు, ఇతర భద్రతా బలగాలు ఎదురుదాడికి దిగాయి. కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ ప్రాంతంపై టర్కీ వాయుసేన బలగం ఎదురుదాడికి దిగి సుమారు 40 మంది తిరుగుబాటుదారులను హతమార్చినట్లు ఓ అధికారి తెలిపారు. కుర్దిష్ ఆధిక్యం ఉన్న తూర్పు టర్కీ ప్రాంతంలో మిలిటెంట్లు గత వారం జరిపిన దాడులలో 16 మంది సైనికులు అమరులైన విషయం విదితమే.