
బాంబు దాడిలో 12 మంది పోలీసుల మృతి
అంకారా: ఓ మినిబస్సుపై జరిగిన బాంబు దాడిలో సుమారు 12 మంది పోలీసులు మృతిచెందగా, మరికొంత మంది గాయపడ్డారు. ఈ ఘటన తూర్పు టర్కీలో చోటుచేసుకుంది. కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ వర్గం వారే ఇందుకు బాధ్యులని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఇగ్డిర్ ప్రాంతంలో దిలుకు సరిహద్దు గేటు వద్ద మినిబస్సుపై బాంబు దాడులు జరిగినట్లు సమాచారం. అజర్బైజాన్ సరిహద్దు సమీపంలో కుర్దిష్ మిలిటెంట్లు జరిపిన దాడిలో 12 మంది పోలీసులు మృతిచెందారు. దీని నుంచి తేరుకున్న పోలీసులు, ఇతర భద్రతా బలగాలు ఎదురుదాడికి దిగాయి.
కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ ప్రాంతంపై టర్కీ వాయుసేన బలగం ఎదురుదాడికి దిగి సుమారు 40 మంది తిరుగుబాటుదారులను హతమార్చినట్లు ఓ అధికారి తెలిపారు. కుర్దిష్ ఆధిక్యం ఉన్న తూర్పు టర్కీ ప్రాంతంలో మిలిటెంట్లు గత వారం జరిపిన దాడులలో 16 మంది సైనికులు అమరులైన విషయం విదితమే.