‘పాల ఉత్పత్తిలో మనమే టాప్’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా పాల ఉత్పత్తిలో గత 15 ఏళ్లుగా భారత్ అగ్రగామిగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ అన్నారు. శ్వేత విప్లవ ఆద్యుడు డాక్టర్ కురియన్ జయంతి సందర్భంగా శనివారం ఢిల్లీలో నిర్వహించిన ‘జాతీయ పాల దినోత్సవం’లో ఆయన పాల్గొన్నారు. పాల ఉత్పత్తిలో గత రెండేళ్లలో దేశం 6.28 శాతం వృద్ధి సాధించిందని పేర్కొన్నారు. 2012 లెక్కల ప్రకారం ప్రపంచలోని 13 శాతం పశుసంపద భారత్‌లోనే ఉందని చెప్పారు.
దేశీయ పశుసంపదను పరిరక్షించడానికి, డైరీల అభివృద్ధికి ప్రభుత్వం ‘రాష్ట్రీయ గోకుల్ మిషన్’ పథకాన్ని ప్రవేశపెట్టిందని వివరించారు. దేశీయ ఆవులు, గేదెల నుంచి లభించే ఏ2 రకం పాలు వివిధ రకాల ఆరోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయని, వీటికి విడిగా మార్కెటింగ్ చేపట్టాలని అభిప్రాయపడ్డారు. పశువుల కొనుగోళ్లు, అమ్మకాలకు ‘ఈ-క్యాటిల్ హాట్’ అనే పోర్టల్‌ను ప్రారంభించారు.