బీడీ కార్మికులకు మేలు చేయండి
దేశ వ్యాప్తంగా బీడీ కార్మికులు దయనీయస్థితిలో అనాగరికంగా బతుకుతున్నారు. దశాబ్దాలుగా కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్నెన్ని ప్రభు త్వాలు మారినా, మారుతూ వస్తున్నా బీడీ కార్మికుల బతుకులు మారడంలేదు. విద్య, భృతి, వసతి, ఆహార సరఫరా కార్డులు, వారి పిల్లలకు చదువులు, ఉపకార వేతనాల మంజూరీ ఆరోగ్యభద్రత కార్డులు మొదలైనవి ఇవ్వాల్సి ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో తుని కాకు సేకరణ విషయంలోనూ, వంద బీడీ కట్టల ధర చెల్లింపులోను ఇప్పుడున్న పరిస్థితులను బట్టి బీడీ కార్మికుల కూలి రేట్లను పెంపు చేయడం చాలా అవసరం. మహిళా బీడీ కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా నిరక్షరాస్యులైన వారి కోసం ప్రత్యేక పాఠశా లలు ఏర్పర్చడం, వారు చదువుకోవడానికి ప్రోత్సహించడం వంటి చర్యలను తప్పక చేపట్టాల్సి ఉంది.
ముప్పై ఏళ్ల వయస్సుకు పైబడిన మహిళా బీడీ కార్మికుల కోసం నెలవారీ భృతిని రెండు వేల రూపాయల దాకా పెంచడం వంటివి చేయాల్సి ఉంది. బీడీ కార్మికులలో పిల్లలు, పెద్దలు, ఆడ, మగ అనే తేడా లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి మేలు చేసే ప్రభుత్వ సంక్షేమ పథకాలతోపాటు అందరికీ, కొంత ప్రీమియం తీసుకొని బీమాను వర్తింపజేస్తే ఎంతో బాగుంటుందని కేంద్ర బీడీ కార్మికశాఖ అధికారులను, తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము.
- కూర్మాచలం వెంకటేశ్వర్లు ఎం.ఎం.తోట, కరీంనగర్