రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలి
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని లేకుంటే మూడు ముక్కలు చేయాలని కర్నూలు జిల్లా కాంగ్రెస్ నేతలు తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిసి స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను వదులుకునేది లేదని కరాకండిగా చెప్పినట్టు తెలిసింది. మీ వాదనలు ఉన్నతస్థాయి కమిటీ ముందు వినిపించాలని వారికి సోనియా గాంధీ సూచించినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమస్యపై ఏకే ఆంటోనీ, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మెయిలీలతో త్రిసభ్య సంఘాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది.
అటు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు.. కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో చర్చలు జరిపారు. రాష్ట్ర విభజనతో తమకు అన్యాయం జరుగుతుందన్న భావన సీమాంధ్ర ప్రజల్లో కనిపిస్తోందని చిదంబరంకు మంత్రులు వివరించారు. విద్య, ఉద్యోగ అవకాశాలు కోల్పోతామనే భయం తమ ప్రాంతం వారిలో ఉందని తెలిపారు. ఇదే విషయాన్నిహోం మంత్రి సుశీల్ కుమార్ షిండే దృష్టి కూడా తీసుకెళ్లామని మంత్రులు తెలిపారు. తమకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని సీమాంధ్ర కేంద్ర మంత్రులు వ్యక్తం చేశారు.