మహానంది ఈఓ పోస్టుకు పోటాపోటీ
మహానంది: మహానంది దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా వచ్చేం దుకు పలువురు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది. డిప్యూటీ కమిషనర్ హోదా కలిగిన మహానంది దేవస్థానానికి ప్రస్తుతం కేవీ సాగర్‌బాబు ఇన్చార్జ్ ఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం విదితమే. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో కొందరు ఇన్చార్జ్ అధికారులుగా విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ స్థానాలలో రెగ్యులర్ ఈఓలను నియమించేందుకు దేవాదాయ శాఖ రంగం సిద్ధం చేస్తుంది.
మరో నెలరోజుల్లో నూతన దేవాదాయశాఖ కమిషనర్ అనురాధ బదిలీల ప్రక్రియ చేపట్టనుండటంతో ఇప్పటి నుంచే పలువురు అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ప్రముఖ శైవ క్షేత్రంగా పేరుగాంచిన, డీసీ హోదా కలిగిన మహానంది దేవస్థానానికి కార్యనిర్వహణాధికారి, డిప్యూటీ కమిషనర్‌గా వచ్చేందుకు పలువురు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. కడప, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.
మహానంది అవకతవకలపై ఫిర్యాదు: మహానంది దేవస్థానంలో కొన్నేళ్లుగా చోటు చేసుకున్న అవకతవకలపై స్థానికులు ఇటీవల నూతన కమిషనర్ అనురాధకు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో ప్రసాదాల విక్రయంలో నాణ్యతా లోపం, బరువు తక్కువగా ఉన్నట్లు వచ్చిన పత్రికా కథనాల ఆధారంగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇటీవల దేవస్థానంలో ఎలాంటి నియామక ప్రకటన లేకుండా ఐదుగురిని నియమించుకున్నారు.
వీరి నియామకాల కోసం డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగులకు డీఏ పెంపుపై అనధికారిక వ సూళ్లకు పాల్పడినట్లు ఇటీవల ఫిర్యాదులు వెళ్లినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. పారిశుద్ధ్యం పనులకు నియమించిన 36 మంది ఉద్యోగులను ఎలాంటి టెండర్లు లేకుండా కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల పలువురు ఉద్యోగులు సస్పెన్షన్‌కు గురికావడం, వారు చేసిన తప్పులు, ఉన్నతాధికారులు తీసుకున్న చర్యలు, తిరిగి వారిలో కొందరి నియామకం లాంటి చర్యలపై కమిషనర్ ఆరా తీసినట్లు సమాచారం.
చలువపందిళ్ల ఏర్పాటు, బిల్లుల చెల్లింపులు, తాత్కాలిక దుకాణాల కేటాయింపులు, ఆలయ పరిధిలో తోపుడుబండ్ల ఏర్పాటులో ఉన్నత ఉద్యోగుల చేతివాటం, తదితర అంశాలపై ఫిర్యాదులు అందడంతో కొంత మంది కీలక ఉద్యోగులను కూడా బదిలీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దేవస్థానంలో రెగ్యులర్ ఈఓ లేకపోవడంతో పాలనా వ్యవస్థ గాడితప్పిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. త్వరలో రెగ్యులర్ ఈఓను నియమించాలని భక్తులు కోరుతున్నారు.