కదిరిలో భారీ చోరీ
కదిరి : కదిరి మున్సిపల్ పరిధిలోని కుటాగుళ్లకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు కేవీ సురేష్‌రెడ్డి ఇంట్లో దొంగలు పడ్డారు. 30 తులాల బంగారు ఆభరణాలు, రూ.30 వేల నగదుతో పాటు కిలో వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... సురేష్‌రెడ్డి ఇంటికి తాళం వేసి సోమవారం (10న) దర్శనార్థం కుటుంబ సమేతంగా ధర్మస్థలం వెళ్లారు. మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి చేరుకున్నాడు.
ఇంటి ఆవరణంలోకి వెళ్లి చూడగా బీరువాలన్నీ తెరిచే ఉన్నాయి. వస్తువులన్నీ చిందరవందరగా పడేశారు. దీంతో వెంటనే పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడికి చేరుకొని బుధవారం జిల్లా కేంద్రం నుండి క్లూస్ టీంను పిలిపించారు. వారు దొంగల వేలిముద్రలను సేకరించారు. ఇన్చార్జ్ డీఎస్పీ కరీముల్లా షరీఫ్ సైతం అక్కడికి చేరుకొని ఇళ్లంతా పరిశీలించారు. తరచుగా ఆ ఇంటికి వచ్చి వెళ్లే వారే ఈ పని చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.