మాది గెలుపు కూటమి
చెన్నై: రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో గెలుపు కూటమి ఆవిర్భవించడం తథ్యమని కేంద్ర నౌకాయూన శాఖ మంత్రి కే వాసన్ ధీమా వ్యక్తంచేశారు.ఎన్నూర్ హార్బర్లో ఆదివారం నిలు వెత్తి కామరాజర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.
ఎన్నూర్ హార్బర్‌కు మాజీ సీఎం, దివంగత నేత కామరాజర్ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆ హార్బర్ ప్రవేశ మార్గంలో నిలువెత్తి కామరాజర్ విగ్రహం ఏర్పాటుకు కేంద్ర నౌకాయూన శాఖ చర్యలు తీసుకుంది. పది అడుగుల ఎత్తుతో 380 కిలోల బరువుతో కామరాజర్ నడిచి వస్తున్నట్టుగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఈ విగ్రహావిష్కరణ ఉదయం జరిగింది.
విగ్రహావిష్కరణ: నిలువె త్తు కామరాజర్ విగ్రహాన్ని కేంద్ర నౌకాయూన శాఖ మంత్రి జికే వాసన్ ఆవిష్కరించారు. అనంతరం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కామరాజర్ సేవల్ని కొనియాడుతూ వాసన్ ప్రసంగించారు. కామరాజర్ ఖ్యాతిని ఎలుగెత్తి చాటే రీతిలో ఈ విగ్రహం రూపుదిద్దుకున్నదని వివరించారు. కామరాజర్ ఆశయాల సాధనే లక్ష్యంగా కేంద్రంలోని తమ ప్రభుత్వం పయనిస్తున్నదన్నారు.
ఆయన హయూంలో ప్రవేశ పెట్టిన పథకాలు జాతీయ స్థాయిలో నేడు అమల్లో ఉన్నాయని గుర్తు చేశారు. దేశాభివృద్ధికి యాభై ఏళ్ల ముందే ఆయన పునాది వేసి వెళ్లారని వివరించారు. అందుకే ఆయన పేరును నామకరణం చేయాలని కేంద్రాన్ని పట్టుబట్టామన్నారు. కేంద్రం అంగీకరించడంతో ఎన్నూర్ హార్బర్‌కు ఆయన పేరును నామకరణం చేశామని, ఉప్పు శాఖ స్థలాల్ని ఈ పోర్టు పరిధిలోకి తీసుకొచ్చామని వివరించారు. కామరాజర్ విగ్రహావిష్కరణతో ఇక్కడి పనులు ముగియ లేదని, ఈ హార్బర్‌ను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ముందుకెళ్లనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నౌకాయూన శాఖ అధికారి మురుగానందన్, ఎన్నూర్ హార్బర్ చైర్మన్ భాస్కర్, చెన్నై హార్బర్ చైర్మన్ అతుల్య మిశ్ర తదితరులు పాల్గొన్నారు.
వాసన్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో తమ నేతృత్వంలో గెలుపు కూటమి ఆవిర్భవించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ వెలువడక ముందే, ఎలా కూటమిని ప్రకటిస్తామన్నారు. చర్చలు సాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో తమ నేతృత్వంలో ఏర్పడే కూటమి గెలుపు కూటమిగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేంద్రం పథకాలు, నిధులు కేటాయిస్తూ వచ్చిందని వివరించారు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ మీద నమ్మకం ఉందని, తమకు పట్టం కట్టడం తథ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల మద్దతు తమకేనని, ఎవరెన్ని కుట్రలు, కుతుంత్రాలు, జిమ్మిక్కులు చేసినా కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని జోస్యం చెప్పారు.