ఏఎన్‌యూ విద్యార్థులకు విదేశీ విద్య
ఒంగోలు వన్‌టౌన్ : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ)లో పీజీ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు విదేశీ విద్యను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు విశ్వవిద్యాలయం వైస్ చాన్సిలర్ (వీసీ) డాక్టర్ కె.వియన్నారావు తెలిపారు. పీజీ విద్యార్థులకు ఆరు కోర్సుల విదేశీ విద్యను అందించేందుకు ఇప్పటికే మూడు విదేశీ విశ్వవిద్యాలయాలతో అవగాహన కుదిరిందన్నారు. మరో రెండు విదేశీ యూనివర్సిటీలతో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు.
స్థానిక అంజయ్య రోడ్డులోని బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన సంస్థలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సహజంగా ఇంజినీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు మాత్రమే విదేశీ విద్యకు అవకాశం ఉందన్నారు. అయితే, సాధారణ డిగ్రీలైన బీఏ, బీఎస్సీ, బీకాంలు పూర్తిచేసి తమ విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సుల్లో చేరిన వారికి కూడా ప్రస్తుతం విదేశీ విద్యను అందుబాటులోకి తెచ్చామన్నారు. విదేశీ విద్య కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ప్రత్యేక ఫీజును నిర్ణయించినట్లు తెలిపారు. ఇంజినీరింగ్ విద్యార్థుల తరహాలో వీరు కూడా జీఆర్ఈ, టోఫెల్ పరీక్షలు రాసి అర్హత సాధించాలన్నారు. మొదటి సంవత్సరం పీజీ తమ విశ్వవిద్యాలయంలో చేస్తే రెండో సంవత్సరం ఆ విద్యార్థులు కోరుకున్న విదేశీ విశ్వవిద్యాలయానికి పంపుతామన్నారు.
రెండేళ్ల కోర్సు పూర్తయిన తరువాత ఆ విశ్వవిద్యాలయమే విద్యార్థులకు పీజీ డిగ్రీ ఇస్తుందన్నారు. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ జార్జియా అట్లాంటా, స్టేట్ యూనివర్సిటీ న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మరో విదేశీ యూనివర్సిటీతో ఆ మేరకు అవగాహన కుదిరినట్లు వీసీ వివరించారు. విదేశీ విద్యకు ఏయే కోర్సుల్లో ఎన్ని సీట్లకు అవకాశం ఉంది, ఇతర పూర్తి వివరాలన్నింటినీ యూనివర్సిటీ వెబ్సైట్లో ఉంచినట్లు తెలిపారు. విద్యార్థులు వెబ్‌సైట్‌ను పరిశీలించి దరఖాస్తు చేసుకుని ప్రవేశం పొందవచ్చన్నారు.
ఇస్రోతో ఒప్పందం...
ఉపగ్రహాల నుంచి సమాచారాన్ని తెలుసుకుని విశ్లేషించేందుకు తమ యూనివర్సిటీ ఇస్రోతో కూడా ఒప్పందం కుదుర్చుకుందని వియన్నారావు వెల్లడించారు. ఇస్రో నుంచి రియల్ టైం బేసిస్‌లో డేటా తీసుకునేందుకు తమ విశ్వవిద్యాలయం ఒక్కదానికే అవకాశం లభించిందన్నారు. ఈ ఉపగ్రహాల సమాచారంతో క్రాప్ ప్యాట్రన్స్, భూమి కోతకు గురయ్యే విషయాలు, ఇతర అన్ని అంశాలను విద్యార్థులు పరిశీలించే అవకాశం ఉందన్నారు. దీనివల్ల విద్యార్థులకు మార్కెట్లో ఉద్యోగావకాశాలు మెరుగవుతాయన్నారు. విద్యార్థుల పరిశోధనలకు కూడా ఇది ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ ఒప్పందానికి అంగీకరించిన ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్, ఎంవైఎస్ ప్రసాద్‌లకు వీసీ కృతజ్ఞతలు తెలిపారు.
రూసాకు మూడు ప్రతిపాదనలు...
ఆచార్య నాగార్జున యూనివర్సిటీని మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్రీయ ఉచితార్ శిక్షాభియాన్ (రూసా)కు మూడు ప్రతిపాదనలు సమర్పించినట్లు వియన్నారావు తెలిపారు. ఒంగోలులోని యూనివర్సిటీ పీజీ సెంటర్‌ను పూర్తిస్థాయి యూనివర్సిటీగా మార్చాలని ప్రతిపాదించారు. దీనికి 55 కోట్ల రూపాయలు అవసరమన్నారు. అదేవిధంగా డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు నైపుణ్యాలు పెంపొందించేందుకు బ్యాచ్‌లర్ ఆఫ్ ఒకేషనల్ కోర్సెస్ మంజూరు చేయమన్నారు.
దీనికి రూ.1.85 కోట్లు అవసరమని చెప్పారు. విశ్వవిద్యాలయంలో ప్రత్యేకంగా మహిళా ఇంజినీరింగ్ కళాశాల నిర్వహణకు కూడా అనుమతికోసం ప్రతిపాదించినట్లు ఆయన పేర్కొన్నారు. దీని కోసం రూసా రూ.20 కోట్లు మంజూరు చేయాల్సి ఉంటుందన్నారు. విలేకరుల సమావేశంలో బ్రిలియంట్ సంస్థ అధినేత న్యామతుల్లాబాషా, ఎస్ఎస్ఎన్ విద్యాసంస్థల డెరైక్టర్ వై.సత్యనారాయణరెడ్డి, ఎస్ఎఫ్ఐ కార్యదర్శి రఘు పాల్గొన్నారు.
ఒంగోలు పీజీ సెంటర్లో కొత్త కోర్సులు
ఒంగోలులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీజీ సెంటర్లో 2014-15 విద్యా సంవత్సరం నుంచి రెండు కొత్త కోర్సులు ప్రారంభిస్తున్నట్లు వీసీ వియన్నారావు తెలిపారు. బీపీఈడీలో 100 సీట్లు, ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్‌లో 25 సీట్లు మంజూైరె నట్లు ఆయన వెల్లడించారు. స్థానిక పేర్నమిట్టలో యూనివర్సిటీ పీజీ సెంటర్‌కు కేటాయించిన 110 ఎకరాల స్థలాన్ని గురువారం వీసీ పరిశీలించారు. 1.30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అకడమిక్ బ్లాక్‌కు ఆయన శంకుస్థాపన చేశారు.
పీజీ సెంటర్ స్థలంలో నీటి కోసం బోర్ వేసేందుకు కూడా స్థలాన్ని పరిశీలించి భూగర్భజలశాఖకు ఆ పని అప్పగించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ పీజీ సెంటర్ స్థలంలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ట్రాక్‌లు, కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్థలం మొత్తాన్ని చదును చేసి స్థలానికి చేరుకునేందుకు రెండు వైపులా రహదారులు నిర్మిస్తున్నామన్నారు. యూనివర్సిటీ స్థలం కబ్జాకు గురి కాకుండా 60 లక్షల రూపాయల వ్యయంతో ప్రహరీ నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఒంగోలు పీజీ సెంటర్‌కు అనుబంధంగా విద్యార్థుల హాస్టల్ కోసం 2.20 కోట్ల రూపాయలతో భవనాన్ని నిర్మించేందుకు యూని వర్సిటీ పాలకవర్గం ఆమోదించిందన్నారు.
ఈ హాస్టల్ భవన నిర్మాణానికి మరో ఏడాది సమయం పడుతుందని, 2015-16 విద్యా సంవత్సరానికి నిర్మాణం పూర్తిచేస్తామని ఆయన వివరించారు. ఒంగోలు పీజీ సెంటర్ విశ్వవిద్యాలయంగా మారాలంటే ప్రభుత్వం పూనుకుని అసెంబ్లీలో తీర్మానం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రెక్టార్ రామసుబ్బయ్య, పీజీ సెంటర్ అధికారులు పాల్గొన్నారు.