క్యాంపాకోలాకు ‘అఖరి’ ఘడియలు
సాక్షి, ముంబై: నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చల్లోకెక్కిన వర్లీలోని క్యాంపాకోలా భవన సముదాయంలోని అక్రమ అంతస్తులలో నివసించే ప్రజలకు రోజులు సమీపిస్తున్న కొద్దీ ఆందోళన పెరుగుతోంది. ఓ వైపు సుప్రీం కోర్టు నుంచి ఊరట లభిం చడం లేదు. మరోవైపు గడువు ముగుస్తోంది. దీం తో క్యాంపాకోలా వాసులు ఆఖరి ప్రయత్నంలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆశ్రయించారు. ఈ మేరకు ఆయనకు ఓ లేఖను రాశారు. దీంతో ఆయన తమ గోడును వింటారన్న ఆశతో ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ అక్రమ అంతస్తుల్లో నివసించే క్యాంపాకోలా వాసులు ఈ నెల 31వ తేదీలోపు ఖాళీ చేయాలి.
ఈ తేదీని మార్చడంపై మళ్లీ సుప్రీం కోర్టు నుంచి వీరికి ఎలాంటి ఊరట లభించలేదు. రోజులు సమీపిస్తున్న కొద్దీ వీరిలో తాము వీధినపడతామన్న భయం కనిపిస్తోంది. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మే 31వ తేదీ అనంతరం అక్రమ అంతస్తులను నేల మట్టం చేయాల్సి రానుండటాన్ని తలచుకొని విచారంలో మునిగిపోయారు. దీంతో బీఎంసీ కూడా జూన్ ఒకటి నుంచి అక్రమ అంతస్తులను కూల్చేం దుకు ఏర్పాట్లు చేస్తుండటంతో వారిలో ఆందోళన రెట్టింపైంది. అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు టెండర్లను కూడా ఆహ్వనించింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు భవనం కూలకుండా ఆపుదామని ఎన్నో ఆశలుపెట్టుకున్న వీరికి తమ ఇళ్లను ఖాళీ చేయాల్సి రానుందని తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
అయితే చివరి ప్రయత్నంలో రాష్ట్రపతి తమని ఆదుకుంటారన్న ఓ ఆశాజ్యోతి కూడా వీరి లో కనిపిస్తోంది. అయితే క్యాంపాకోలా వాసులతోపాటు ఇతర ప్రజల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. క్యాం పాకోలా భవనాన్ని నేలమట్టం చేస్తే అదే తరహాలో ఇతర పాత భవనాలను కూడా కూల్చుతారన్న ఆందోళన ఇతరుల్లో కనబడుతోంది. క్యాంపాకోలా భవన సముదాయంలో మొత్తం ఏడు భవనాలున్నా యి. వీటిలో మొత్తం 35 అంతస్తులు అక్రమంగా నిర్మిం చారు. ఈ అంతస్తుల్లోని 140 ఫ్లాట్లు నేలకూల్చేందు కు గత సంవత్సరం నవంబర్లో బీఎంసీ ప్రయత్నించింది. అయితే అన్ని పార్టీలు ఏకమై అడ్డుకున్నాయి. దీంతో బీఎంసీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మానవ దృక్పథంతో అత్యున్నత న్యాయస్థానం కూడా వీరికి ఖాళీ చేసేందుకు ఏడు నెలల గడువు ఇచ్చింది.
అయితే ఆ గడువు మే 31వ తేదీతో ముగియనుంది. ఈ ఏడు నెలల్లో క్యాంపాకోలా ఆక్రమ అంతస్తుల్లో నివసించే ప్రజలు తమ ఇళ్లను కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే ఇప్పటివరకు వీరికి ఎవరి నుంచి ఎలాంటి హామీ లభించలేదు. ఈ నేపథ్యంలో క్యాం పాకోలా వాసులు చివరి ప్రయత్నంలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీపై కోటి ఆశలు పెట్టుకుని ఉన్నారు.