ఓటాన్ అకౌంట్‌కు గవర్నర్ ఓకే
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఆమోదించిన 2014-15 సంవత్సరపు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు గవర్నర్ నరసింహన్ ఆమోద ముద్ర వేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి గురువారం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పటికీ ఆరునెలల వ్యయానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్‌కు మాత్రమే సభ ఆమోదం ఉన్నందున, బడ్జెట్ కేటాయింపుల్లో ఆరునెలలకు మించి వ్యయం కాకుండా అన్ని శాఖల చీఫ్ కంట్రోలింగ్ అధికారులు చూడాలని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పేర్కొన్నారు.
తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఆరు నెలలకు మించి నిధులను వ్యయం చేయరాదని, ఆరునెలల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్‌కు ఆమోదం పొందుతామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదనపు వ్యయాలకు అసెంబ్లీ ఆమోదానికి సంబంధించిన ఉత్తర్వులను కూడా ఆర్థిక శాఖ జారీ చేసింది.