ఉప ఎన్నికపై విచారణ జరపాలి: రమణ
మెదక్ జిల్లా నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికల ఫలితాలు నిలుపుదల చేయాలని ఆ లేఖలో కోరారు.
‘ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిన విషయం ఫలితాల ద్వారా మరో సారి స్పష్టం అయ్యింది. ఈవీఎంల ట్యాంపరింగ్ పాల్పడినట్లు స్పష్టమవుతోంది. టీడీపీ బలంగా ఉన్న గ్రామాల్లో కేవలం సింగిల్ డిజిట్లో ఓట్లు వచ్చాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారో, నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లోనూ అదే విధంగా చేశారు...’ అని కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ నసీమ్ జైదీకి రాసిన లేఖలో ఎల్.రమణ పేర్కొన్నారు.
అధికార పార్టీకి, ఇతర పార్టీలకు ఇచ్చిన ఓటర్ల జాబితాల్లో కూడా అనేక తప్పులు ఉన్నాయని ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల వద్ద, అధికారుల వద్ద తాజా జాబితా ఉండగా, ప్రతిపక్ష పార్టీలకు మాత్రం పాత జాబితాలు ఇచ్చారని ఆ లేఖలో వివరించారు. ఉప ఎన్నికపై సమగ్ర విచారణకు ఆదేశించాలని కోరారు. ఇదే లేఖ ప్రతిని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఎల్.రమణ అందజేశారు.