లా లొరోనా
విన్న ప్రతిదాన్నీ నమ్మలేం. నమ్మిన ప్రతిదీ నిజమనీ చెప్పలేం. ముఖ్యంగా దెయ్యాల విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఎప్పుడూ ఉంటుంది. దెయ్యాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ, వాటి గురించిన కథనాలు మాత్రం కోకొల్లలుగా ఉన్నాయి. వాటిలో ఇదొకటి...
లా లొరోనా గురించి ఇంకో కథనం కూడా ప్రచారంలో ఉంది. ఇద్దరు పిల్లలకు తల్లయిన తర్వాత మారియా మరో వ్యక్తితో ప్రేమలో పడిందని, అతడి కోసం తన భర్తను, పిల్లలను కూడా చంపేసిందని, అప్పటికీ అతడు తనని స్వీకరించకపోవడంతో అవమానం భరించలేక మరణించిందని కొందరు అంటుంటారు. చనిపోయేముందు తన పిల్లలను చంపినందుకు ఎంతో కుమిలిపోయిందని, అందుకే ఆమె ఆత్మ వాళ్ల కోసం పరితపిస్తోందని చెబుతుంటారు. అయితే ఈ కథనాన్ని నమ్మేవాళ్లు తక్కువమందే ఉన్నారు.
మెక్సికో నగరం (యు.ఎస్.ఎ)...
టేబుల్ మీద భోజనాలను సర్దుతోంది బ్రెండా. ‘‘ఇవాన్... భోజనానికి రా’’ అంది ప్లేటులో ఆహారాన్ని వడ్డిస్తూ. ‘‘ఆ ఆ వస్తున్నా’’ అంటూ వచ్చి కూర్చున్నాడు ఇవాన్. అటూ ఇటూ చూసి... ‘‘బెన్ ఎక్కడ?’’ అన్నాడు. ‘‘ఏం చెప్పమంటారు మీ సుపుత్రుడి గురించి? ఉన్నచోట ఉండడు కదా! ఆడుకోవడానికని వెళ్లాడు. ఇంతవరకూ రానేలేదు’’ అంది తను కూడా కూర్చుంటూ. ‘‘రాకపోతే అలా వదిలేయడమేనా... నాకు చెబితే తీసుకొస్తాను కదా’’ అంటూ లేచాడు ఇవాన్.‘‘అరే... అంత కంగారుపడతావెందుకు? రోజూ బయటికెళ్లి ఆడుకోవడం వాడికలవాటే కదా’’ అంది బ్రెండా భర్తవైపు చూస్తూ. ‘‘ఆడుకోవడం అలవాటే కానీ ఈ టైమ్ వరకూ ఆడుకోవడం అలవాటు లేదు కదా... టైమ్ చూడు, తొమ్మిది దాటుతోంది’’ అంటూనే చెప్పులేసుకుని బయటకు నడిచాడు ఇవాన్.
నిట్టూర్చింది బ్రెండా. ‘‘వాడూ మాట వినడు. ఈయనా వినడు. మధ్యలో నేను చస్తున్నాను’’ అంటూ భర్తకు భోజనం వడ్డించిన ప్లేటు మీద మరో ప్లేటు బోర్లించి లేచింది. భర్త, కొడుకు కోసం ఎదురుచూస్తూ గుమ్మం దగ్గరే కూలబడింది. అరగంట తర్వాత వచ్చాడు ఇవాన్... ఒంటరిగా. అతడి వెంట పిల్లాడు లేకపోవడం చూసి కంగారుపడింది బ్రెండా. ‘‘ఒక్కడివే వచ్చావేంటి? బెన్ ఏడీ?’’ అంది ఆతృతగా. మౌనంగా ఆమె ముఖంలోకి చూశాడు ఇవాన్. ఆమె చూపుల్లో కనిపిస్తోన్న ఆదుర్దాను చూసి మనసు అదోలా అయిపోయింది అతనికి. ‘‘బెన్ కనిపించలేదు’’ అన్నాడు నసుగుతున్నట్టుగా. ‘‘కనిపించడం లేదా? అంటే ఏంటి నీ ఉద్దేశం? మిసెస్ ఫెర్నాండాని అడిగావా... రోజూ వాళ్లింటికే వెళ్తాడు. వాళ్లమ్మాయితోనే ఆడుకుంటాడు.’’‘‘అక్కడికే వెళ్లాను. కానీ వాడు ఎప్పుడో వెళ్లిపోయాడని చెప్పిందావిడ. ఆ చుట్టుపక్కలంతా కూడా వెతికాను. ఎక్కడా కనిపించలేదు.’’ఆ మాట వింటూనే బావురుమంది బ్రెండా. ‘‘ఏమైపోయాడు? నా చిట్టితండ్రి ఎక్కడికెళ్లిపోయాడు? ఇవాన్... ఏం చేస్తావో తెలీదు. నాకు నా బెన్ కావాలి. తెచ్చివ్వు. వెంటనే తెచ్చివ్వు’’ అంటూ భర్తను వాటేసుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది.
ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఇవాన్కి. మెల్లగా అన్నాడు... ‘‘ఒకవేళ మారియా ఏమైనా...’’ ఉలిక్కిపడింది బ్రెండా. గుండె ఝల్లుమంది. ఆ వణుకు ఒళ్లంతా పాకినట్టయ్యింది. ‘‘మారియానా? ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు?’’ అంది ఆవేశంగా భర్త కాలర్ పట్టుకుని. ‘‘కూల్ బ్రెండా... ఆవేశపడకు. మనింటికి రెండు దారులున్నాయి. మామూలు దారిలో వస్తే సమస్య లేదు. కానీ ఒకవేళ త్వరగా వచ్చేద్దామని బెన్ ఆ దారిలోకి కనుక వెళ్లుంటే...’’ ‘‘లేదు... అలా జరగదు’’ భర్త మాట పూర్తవ్వకుండానే అరిచింది బ్రెండా. ‘‘నువ్వంటున్నది నిజం కాదు ఇవాన్.. అలా జరగదు. జరగడానికి వీల్లేదు.’’ పిచ్చిదానిలా అరుస్తూ ఏడుస్తోన్న భార్యను ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు ఇవాన్కి. గబగబా వెళ్లి చుట్టపక్కల వాళ్లను తీసుకొచ్చాడు. అందరూ కలిసి అక్కడికి కాస్త దూరంలో ఉన్న చెరువు దగ్గరకు చేరుకున్నారు. లాంతర్లు, కొవ్వొత్తులు, టార్చిలైట్లు పట్టుకుని అంతా వెతికారు. ఈత బాగా వచ్చిన కొందరు చెరువులోకి కూడా దిగి చూశారు. ఫలితం శూన్యం. బెన్ జాడ దొరకలేదు.
‘‘ఇక లాభం లేదు. ఇంతకు ముందు జరిగినట్టుగానే ఇప్పుడూ జరిగింది’’ అన్నాడో వ్యక్తి పెదవి విరుస్తూ. ‘‘అవును. ఇక బెన్ జాడ తెలుసుకోవడం అసాధ్యం’’ అన్నాడు మరో వ్యక్తి. ‘‘అయినా మారియా చేతికి చిక్కినవాళ్లు మళ్లీ కనిపించడం ఎప్పుడైనా జరిగిందా’’ అందో మహిళ. ఆ మాటలు వింటూనే బేజారైపోయింది బ్రెండా. ‘బెన్’ అని అరుస్తూ సొమ్మసిల్లిపోయింది. ఆమెను చూసి అందరి మనసుల్లోనూ జాలి నిండిపోయింది. కానీ ఎవరేం చేయగలరు? అందుకే ఒక్కొక్కరుగా అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఇంతకీ బెన్ ఏమైనట్టు? ఏదో చేసింది అంటోన్న ఆ మారియా ఎవరు? ఆమె అతడిని ఏం చేసింది? తెలుసుకోవడం తేలికే. కానీ తెలుసుకున్న విషయాన్ని నమ్మడానికి మాత్రం చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే... మారియా మనిషి కాదు... దెయ్యం!
మెక్సికో నగరానికి వెళ్లి, మారియా తెలుసా అని అడిగి చూడండి... అక్కడివాళ్లు ఉలిక్కిపడతారు. అంతగా వారిని భయపెట్టిందా దెయ్యం. మెక్సికో నగరంలోని ప్రధాన రహదారి మీద రాత్రిపూట ఒక సమయం దాటిన తర్వాత ప్రయాణించాలంటే భయపడేవాళ్లు చాలామంది ఉన్నారు. ఎందుకంటే... ఎక్కడైనా మారియా కనిపిస్తుందేమోనని భయం! చీకటి పడిన తర్వాత తమ పిల్లలను బయటకు పంపించేందుకు వాళ్లు అస్సలు ఇష్టపడరు. ఎందుకంటే... వాళ్లని మారియా ఎత్తుకుపోతుందేమోనని! ఈ భయం వెనుక శతాబ్దం ముందునాటి కథ ఉంది.
వందేళ్లకు పూర్వం... మెక్సికో నగరంలో మారియా అనే పేద యువతి నివసించేది. ఆమెకు తన పేదరికాన్ని చూసి చాలా వేదనగా ఉండేది. చినిగిన బట్టలు, నిండని కడుపులు, ఆగని కన్నీళ్లు ఆమెకు నచ్చేవి కావు. ఆ నిజాలను భరించలేక ఎక్కువగా ఊహల్లో విహరించేది. తన కోసం ఓ ధనికుడు గుర్రం మీద వస్తాడని, తనను మనువాడతాడని, మంచి జీవితాన్ని ఇస్తాడని కలలు గనేది. నిజంగానే ఓ రోజు ఓ ధనికుడు వ్యాపార నిమిత్తం గుర్రంమీద అక్కడకు వచ్చాడు. అతడిని చూస్తూనే వలపుల తోటలో విహారం మొదలుపెట్టింది మారియా. ఆమె కళ్లు రోజూ అతడినే వెతికేవి. అతడు వస్తున్నాడేమోనని దారివైపే చూస్తూ కాలం గడిపేది. గుర్రపు పాదాల సవ్వడి కోసం చెవులు రిక్కించేది. అతడు కనిపించిన ప్రతిసారీ అతడి కంట్లో పడాలని అక్కడక్కడే తచ్చాడేది. ఎలాగైతేనేం... ఆ యువకుడి దృష్టిని తనవైపు తిప్పుకుంది. దాంతో వ్యాపారం పెట్టేందుకు వచ్చిన అతగాడు... ఆమెను పెళ్లాడి ఆ నగరంలోనే కాపురం పెట్టాడు. ఆమె సౌందర్యారాధనలో మునిగి తేలాడు. ఇద్దరు బిడ్డలకు తండ్రయ్యాడు.
అయితే ఆ తర్వాత అతడి మనసు మళ్లిపోయింది. మనసు కొత్త ఆనందాల కోసం వెతకసాగింది. ఒక డబ్బున్న మహిళను మనువాడేందుకు పరితపించాడు. అది తెలియని మారియా... వ్యాపార పనుల్లో పడి భర్త తనకోసం సమయం కేటాయించలేకపోతున్నాడేమో అనుకునేది. ఎలాగైనా అతడిని ఎప్పటిలాగా దగ్గర చేసుకోవాలని నానా తంటాలు పడేది. కానీ ఓరోజు పరస్త్రీతో తన భర్త నవ్వుతూ మాట్లాడటం దూరం నుంచి చూసింది. అతడు ఆమెను ముద్దాడటం భరించలేకపోయింది. ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక, తన పిల్లల మీద చూపించింది. చెరువు దగ్గర ఆడుకుంటున్న వాళ్లిద్దరినీ నీటిలోకి తోసేసింది. ఆ తర్వాత తను ఎంత తప్పు చేసిందో అర్థమైంది ఆమెకి. పిల్లల కోసం అల్లాడిపోయింది. కళ్లముందే నీటిలో కొట్టుకుపోతున్న వాళ్లిద్దరినీ కాపాడుకోవాలని పరితపించింది. కానీ పూర్తిగా విఫలమయ్యింది. ఆమె చూస్తూండగానే వాళ్లు జలసమాధి అయిపోయారు. తాను ఎంతటి పాతకానికి ఒడిగట్టిందో తలచుకుని తలచుకుని కుమిలిపోయిందామె. అక్కడే కొన్ని గంటల పాటు ఏడ్చి ఏడ్చి, గుండె పగిలి చనిపోయింది. మారియా మృతదేహాన్ని అక్కడే గొయ్యి తీసి పాతిపెట్టారు చుట్టుపక్కలవాళ్లు.
ఆ రోజు రాత్రి... అందరూ నిద్రపోతుండగా... ఉన్నట్టుండి ఓ ఏడుపు వినిపించింది.. ఎంతో భయంకరంగా, బాధాకరంగా! ‘‘బాబూ, ఏమైపోయార్రా, ఎక్కడున్నార్రా, నా దగ్గరకు రండిరా’’ అంటూ ఒకటే అరుపులు, ఏడుపులు! అందరూ ఉలిక్కిపడి లేచారు. ఏడ్చేది ఎవరా అని వెతికారు. ఎవరూ కనిపించలేదు. అలా రోజూ జరగసాగింది. దాంతో... ఆ ఏడుస్తోంది ఎవరో కాదు, మారియాయేనని అందరికీ అర్థమైంది. తెల్లని గౌను వేసుకుని, జుత్తు విరబోసుకుని చాలామందికి కనిపించేదామె. దాంతో ఆమె దెయ్యమైందని అర్థమైపోయింది అందరికీ. అందుకే ఆమెకు ‘లా లొరోనా’ అని పేరు పెట్టారు. అంటే... ‘వీపింగ్ ఉమన్ (దుఃఖించే మహిళ)’ అని అర్థం!
అది మాత్రమే కాదు... ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పిల్లలు మాటిమాటికీ జడుసుకునేవారు. జ్వరాలు తెచ్చుకునేవారు. నిద్రలో పీడకలలు వచ్చి పెద్దగా ఏడ్చేవారు. అదంతా మారియా వల్లనేననే ప్రచారం మొదలైంది. పైగా కొందరు పిల్లలు ఒకరి తర్వాత ఒకరు వరుసగా మాయమైపోవడం మొదలైంది. దాంతో మారియా పిల్లల్ని ఎత్తుకుపోతోందనే భయం మొదలైంది జనాల్లో. అయితే ఇదంతా భ్రమ అనేవాళ్లు లేకపోలేదు. ఇది ముమ్మాటికీ నిజమేనని నొక్కి వక్కాణించేవాళ్లూ ఉన్నారు. వీడియోలు, ఫొటోల్ని సాక్ష్యంగా చూపించేవాళ్లూ ఉన్నారు. కానీ దేన్ని నమ్మాలి అనేది... వారి వారి విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది కదా! అందుకే లా లొరోనా కథ ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది!
- సమీర నేలపూడి