పిల్లలకు ఎంత కష్టం!
పలక, బలపం పట్టాల్సిన చిన్నారులు మెకానిక్ షెడ్లలో సుత్తి, స్క్రూడ్రైవర్లతో కుస్తీ పడుతున్నారు. అమ్మచేత్తో గోరుముద్దలు తినాల్సిన పిల్లలు హోటళ్లలో ఎంగిలి ప్లేట్లు కడుగుతున్నారు.
చిత్తూరు(గిరింపేట), న్యూస్‌లైన్: బాలల హక్కుల చట్టం ప్రకారం 14 ఏళ్లలోపు పిల్లలు ఎవరినీ పనిలో పెట్టుకోకూడదు. జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఐసీడీఎస్ శాఖ పరిధిలో సమగ్ర బాలల సంరక్షణ పథకం (ఐసీపీఎస్) అధికారులు, కార్మికశాఖ అధికారులు, పోలీసుశాఖ సహకారంతో దాడులను నిర్వహించాల్సి ఉంది. అయితే వీరు మొక్కుబడిగా ఏడాదికోసారి దాడులు నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఐసీపీఎస్ అధికారులు గత ఏడాది మదనపల్లెలో 22 మంది, చిత్తూరులో 11 మంది, గంగాధరనెల్లూరులో ఇద్దరు, పూతలపట్టులో ముగ్గురు, పుత్తూరులో ఇద్దరు, పీలేరులో నలుగురు, రేణిగుంటలో నలుగురు, శ్రీకాళహస్తిలో ముగ్గురు, బి.కొత్తకోటలో ముగ్గురు, బంగారుపాళెంలో ఇద్దరు, సత్యవేడులో ముగ్గురు, పెనుమూరులో ముగ్గురు, తిరుపతిలో ఒకరు, పుంగనూరులో ఒకరు చొప్పున బాలకార్మికులను గుర్తించి బడిలో చేర్పించినట్లు రికార్డులు చెబుతున్నాయి.
మరోవైపు జిల్లాలో బాల కార్మికుల సంఖ్య వేలల్లో ఉన్నట్లు అనధికారిక అంచనా. క్వారీలు, షెడ్లు, ఇటుకబట్టీలు తదితర ప్రాంతాల్లో చిన్నారుల బంగారు భవిత బందీ అయిపోతోంది. జిల్లా కేంద్రం చిత్తూరులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్, మిట్టూరు, ఎంజీఆర్వీధి, కొంగారెడ్డిపల్లె తదితర ప్రాంతాల్లో బాల కార్మికులు ఎక్కువగా ఉన్నా పట్టించుకునే వారు లేరు. చిత్తూరు రూరల్ ఈస్ట్ సీఐ, చిత్తూరు తహసీల్దార్ కొలువుండే కార్యాలయాలకు ఎదుటుండే షెడ్లలో బాలకార్మికులు మగ్గుతున్నారు. ఐసీపీఎస్ అధికారుల సమాచారం ప్రకారం క్వారీలు అధికంగా ఉండే తిరుపతి, చిత్తూ రు, మదనపల్లె, శ్రీకాళహస్తి తదితర ప్రాంతాల్లో బాల కార్మికులు అధికంగా కనిపిస్తున్నారు.
నిబంధనలేం చెబుతున్నాయంటే..
చట్ట ప్రకారం 14 ఏళ్లలోపు పిల్లలు తప్పనిసరిగా బడిలో ఉండాలి. వీరిచేత ఎటువంటి పనులూ చేయించుకోకూడదు. పిల్లల చేత పనులు చేయిస్తే ఆ యజమానికి మూడు నెలలకు తక్కువ కాకుండా జైలు శిక్ష, రూ.10 వేల వరకు జరిమానా విధించవచ్చు. ప్రమాదకర వృత్తిలో పిల్లల్ని పెట్టుకుంటేఆరు నెలల నుంచి ఏడాది జైలు శిక్ష, రూ.20 వేల వరకు జరిమానా విధిస్తారు. ఇదివరకు శిక్షపడి మళ్లీ పిల్లలతో పని చేయించుకుంటే ఆరు నెలల నుంచి రెండేళ్లు జైలుశిక్ష విధిస్తారు. అయితే అధికారులు దాడులు చేసి పిల్లల్ని పనిలో చేర్పించుకున్న వారిని మందలించి వదిలేస్తున్నారే తప్ప ఎక్కడా జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
లోపిస్తున్న సమన్వయం
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఐసీపీఎస్, పోలీస్, కార్మిక శాఖలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంది. అయితే పరిస్థితి భిన్నంగా ఉంది. బాలకార్మికులు ఎక్కడైనా ఉన్నారని తెలిస్తే అధికారులు వెళ్లి విచారణ చేపట్టాలి. నేరం రుజువైతే యజమానిపై చర్యలు తీసుకోవాలి. బాలలను రాజీవ్ విద్యామిషన్ నిర్వహించే ఆర్‌ఎస్‌టీసీలకు, బాలికలను ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే చిల్డ్రన్హోమ్లకు తరలించాలి. ఈ కార్యక్రమాలేవీ పెద్దగా జరుతున్న దాఖలాలు లేవు.
కఠిన చర్యలు తీసుకుంటాం
చట్టాలను ఉల్లంఘించి ఎవరైనా పిల్లల్ని పనిలో పెట్టుకుంటే జైలు శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకుంటాం. కార్మికశాఖ అధికారుల కార్యాలయం తిరుపతిలో ఉండడంతో వారితో క్రమం తప్పకుండా ప్లాన్ చేసుకోలేకపోతున్నాం. ఈ క్రమంలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించకపోతున్నాం. త్వరలో అన్ని శాఖల అధికారులతో కలిసి ప్లాన్ చేసుకుని దాడులు నిర్వహించాలనుకుంటున్నాం.
-ఉషా ఫణికర్, ప్రాజెక్టు డెరైక్టర్, జిల్లా స్త్రీ,శిశు సంక్షేమశాఖ