lack of employees
-
పట్టు తప్పుతున్న ప్లానింగ్
సాక్షి, విశాఖపట్నం : మహా విశాఖ నగరంలో టౌన్ ప్లానింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందా? ఉన్న అధికారాలన్నీ టీడీపీ ఎమ్మెల్యేల గుప్పిట్లో బందీ అయ్యాయా? అంటే అవుననే స్పష్టమవుతోంది. ఎమ్మెల్యేలు చెప్పినట్లు వినకపోతే ఉద్యోగానికి భద్రత ఉండదనే భయంతో ఐదేళ్ల పాటు వారు చెప్పినట్లే వినాల్సిన పరిస్థితి. గత కమిషనర్ సైతం ఈ విభాగంపై సరైన దృష్టి సారించలేదనే వాదనలూ వినిపిస్తున్నాయి. స్వచ్ఛభారత్, పారిశుద్ధ్యం, నీటి సరఫరా తదితర ప్రాథమిక అవసరాలపైనే దృష్టి సారించారు తప్ప టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఏం జరుగుతుందనే విషయాలను పట్టించుకోలేదనీ అంటున్నారు. ఆఖరి కొద్ది నెలల్లో పట్టణ ప్రణాళిక విభాగం గురించి ఆలోచించినా.. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. సరైన మోనటరింగ్ వ్యవస్థ లేకపోవడం, ఎమ్మెల్యేల పెత్తనంతో టౌన్ ప్లానింగ్ సిబ్బంది వారు చెప్పిందే చేస్తూ జోన్లను ప్రత్యేక వ్యవస్థలుగా మలచుకున్నారు. వేధిస్తున్న సిబ్బంది కొరత గతంలో ప్రతి జోన్‌కు ఇద్దరు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, ఇద్దరు చైన్‌మెన్ ఉండేవారు. ఎక్కడైనా అక్రమ నిర్మాణం కానీ, ఆక్రమణలు కానీ కనిపిస్తే ప్రధాన కార్యాలయానికి నేరుగా సమాచారం అందించేవారు. కానీ ఇప్పుడు టౌన్ ప్లానింగ్ విభాగాన్ని సిబ్బంది కొరత వేధిస్తోంది. ప్రతి జోనల్ కార్యాలయంలో ఏసీపీ, టీపీఎస్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పైనే టౌన్ ప్లానింగ్ విభాగం ఆధారపడి పనిచేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక జీవీఎంసీ విషయానికొస్తే.. ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక్క బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కూడా లేరాయె.. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌గా ఉన్న సమయంలో 110 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో నలుగురు సూపర్వైజర్లు, ముగ్గురు ఏసీపీలు, ముగ్గురు టీపీవోలు, ఒక సిటీ ప్లానర్ ఉండేవారు. 2006లో 600 చ.కి.మీ.కి పైగా విస్తీర్ణం పెరిగిన జీవీఎంసీలో 25 మంది సూపర్ వైజర్లు, 11 మంది టీపీవోలు, 11మంది ఏసీపీలు, నలుగురు డీసీపీలు, ఇద్దరు సిటీ ప్లానర్లు, ఒక చీఫ్ సిటీ ప్లానర్ ఉండాలి. కానీ ఒకే ఒక్క సిటీ ప్లానర్, ఒక డీసీపీ, 8 మంది ఏసీపీలు, 11 మంది టీపీవోలు, 15 మంది సూపర్వైజర్లు మాత్రమే ఉన్నారు. వీరికి తోడుగా 30 మంది అప్రెంటిస్‌ను గత ప్రభుత్వం నియమించింది. కానీ, వీరిని సాంకేతిక సలహాలకు మాత్రమే తప్ప క్షేత్రస్థాయి పరిశీలనలకు వినియోగించకూడదు. జీవీఎంసీ విస్తీర్ణం ప్రకారం 50 మంది సూపర్వైజర్లు ఉండాలి, కానీ నగరంలో ఒక్క బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కూడా లేకపోవడం పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అద్దం పడుతోంది. దీనివల్ల క్షేత్ర స్థాయి పరిశీలనలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విభాగాన్ని గాడిలో పెట్టాలంటే కొత్త కమిషనర్ సృజన కఠిన చర్యలు అవలంబించాల్సిందే. సిబ్బంది భర్తీకి చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు సమీక్షిస్తే తప్ప అనధికారిక కట్టడాలకు చెక్ పెట్టలేరు. -
తహసీల్దార్ రిజిస్ట్రేషన్లు.. అంత ఈజీ కాదట!
సాక్షి, హైదరాబాద్ : రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందించే ప్రతిపాదనపై భిన్నాభి ప్రాయం వ్యక్తమవుతోంది. అటు ప్రభుత్వ పెద్దలుగానీ, ఇటు ఉన్నతాధికారులుగానీ పైకి ఏమీ మాట్లాడకపోయినా ఈ ప్రతిపాదన సాధ్యాసాధ్యాలపై తీవ్రమైన తర్జనభర్జన జరుగుతోంది. కొత్త విధానం అమలు అంత సులువుకాదని, ప్రస్తుత విధానం కొనసాగింపే మేలన్న భావన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఈనెల 8న జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అంతర్గతంగా ఇచ్చిన నివేదిక కీలకంగా మారింది. ఎమ్మార్వో కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవల అమలు సాధ్యాసాధ్యాలకు సంబంధించి ఆ నివేదికలో పేర్కొన్న గణాంకాలు, సూచనలు ప్రభుత్వ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. ప్రస్తుత విధానాన్ని కొనసాగించడమే మంచిదని ఆ నివేదిక స్పష్టం చేసినట్లు తెలిసింది.నివేదికలోని ముఖ్యాంశాలివీ.. రోజుకు ఒకటి రెండు డాక్యుమెంట్లే! గతేడాది రాష్ట్రంలోని 567 గ్రామీణ మండలాల్లో వ్యవసాయ భూముల కేటగిరీలో 4,54,607 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. అందులో 373 మండలాల్లో సగటున రోజుకు మూడు అంతకన్నా తక్కువ సంఖ్యలో (260 మండలాల్లో రోజుకు రెండు.. ఇందులో 128 మండలాల్లో రోజుకో డాక్యుమెంట్ మాత్రమే) డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. మిగతా 194 మండలాలకుగాను 65 చోట్ల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. అంటే సబ్రిజిస్ట్రార్లు లేని 129 మండలాల్లో మాత్రమే రోజుకు మూడు కన్నా ఎక్కువ లావాదేవీలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని మండల కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు, మానవ వనరుల కల్పన అనవసరపు భారంగా మారుతుంది. ‘శిక్షణ’తో తలనొప్పి ప్రస్తుతం డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ల చట్టం–1908, స్టాంపుల చట్టం–1899 ప్రకారం రిజిస్టర్ అవుతున్నాయి. ఇప్పుడు ఎమ్మార్వో కార్యాలయాల్లో రిజిస్టర్ చేయాలంటే.. ఎమ్మార్వోలకు ఈ చట్టాలు, నియమ నిబంధనలు, స్టాండింగ్ ఆర్డర్ల గురించి శిక్షణ ఇవ్వాలి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రస్తుతం అమలు చేస్తున్న ‘కార్డ్ (కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్)’ వ్యవస్థపై కూడా 443 మంది ఎమ్మార్వోలకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్లున్న మండలాల్లో పనిచేస్తున్న ఎమ్మార్వోలకు వీటి గురించి అవగాహన ఉండదు. వారు తర్వాత సబ్రిజిస్ట్రార్లు లేని మండలాలకు బదిలీ అయితే శిక్షణ ఇవ్వాల్సి వస్తుంది. బోలెడు సిబ్బంది అవసరం ప్రతి సబ్‌రిజిస్ట్రార్‌కు ఒక సీనియర్ అసిస్టెంట్, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు సబార్డినేట్లు, క్లర్కులు కావాలి. మార్కెట్ విలువ సర్టిఫికెట్ల జారీ, చెక్స్లిప్ల తయారీ, డాక్యుమెంట్ల స్కానింగ్, చలానాలు, ఈసీల తయారీ, బయోమెట్రిక్ వివరాల సేకరణ, వెబ్‌ల్యాండ్‌ను పోల్చడం, పాస్ పుస్తకాల పరిశీలన, రికార్డుల మెయింటెనెన్స్, స్టాంపుల అమ్మకాల వంటి బాధ్యతలు ఉంటాయి. ఈ మేరకు పోస్టులు మంజూరు చేయాల్సి ఉంటుంది. ‘నెట్వర్క్’ ఎలా..? రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ‘కార్డ్ (కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్)’ వ్యవస్థ ఆధారంగా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఎమ్మార్వో కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేయాలంటే ఆ మేరకు కంప్యూటర్లు, ఇంటర్నెట్ నెట్వర్క్ అనుసంధానం అవసరం. రాష్ట్రంలోని భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతమున్న 141 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు నెట్‌వర్క్‌ను నిర్వహించడమే గగనంగా ఉంది మారుమూల ప్రాంతాల్లోని 584 ఎమ్మార్వో కార్యాలయాలకు నెట్వర్క్ అందించడం చాలా కష్టం. సబ్రిజిస్ట్రార్ల పరిధితో తిప్పలు ప్రస్తుతం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు మండలాల ప్రాతిపదికన లేవు. కొన్ని మండలాల్లో సగం గ్రామాలు ఓ సబ్‌రిజిస్ట్రార్, మరిన్ని గ్రామాలు మరో సబ్‌రిజిస్ట్రార్ పరిధిలో ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మార్వో కార్యాలయాల వారీగా విధానం అమలుతో.. పలు సబ్రిజిస్ట్రార్ల కార్యాలయాల పరిధిని మార్చాల్సి ఉంటుంది. పర్యవేక్షణకు ఇబ్బందులు ఇప్పుడున్న వ్యవస్థ ప్రకారం సబ్రిజిస్ట్రార్లు జిల్లా రిజిస్ట్రార్లకు, వారు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్‌కు బాధ్యులుగా ఉంటారు. ఎమ్మార్వోలు నేరుగా కలెక్టర్లకు బాధ్యులుగా ఉంటారు. ఇప్పుడు సబ్‌రిజిస్ట్రార్లతోపాటు ఎమ్మార్వోలు రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తే.. వారు ఎవరికి బాధ్యులుగా ఉండాలన్న సందేహం తలెత్తుతోంది. దీనితో ఇరు శాఖల సమన్వయంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశముంది. ఎమ్మార్వోలు అందుబాటులో లేకుంటే..? ఎమ్మార్వోల వ్యవస్థ అత్యంత క్రియాశీలంగా ఉంటుంది. వారు వారంలో మూడు రోజుల పాటు తమ పరిధిలో క్షేత్రస్థాయి పరిశీలనలతోపాటు వ్యవసాయం, సాగునీరు, ప్రోటోకాల్ లాంటి విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. ‘క్రాస్ చెకింగ్’కు ఇబ్బందే ప్రస్తుతం భూముల మార్కెట్ విలువలను సబ్రిజిస్ట్రార్లు కన్వీనర్లుగా ఉన్న కమిటీ నిర్ధారిస్తుంది. అందులో ఎమ్మార్వో సభ్యుడిగా ఉంటారు. ఇప్పుడు ఈ రెండూ ఎమ్మార్వోనే చేయాల్సి వస్తుంది. ఇక నిషేధిత భూముల జాబితాలను ఎమ్మార్వోలే సబ్రిజిస్ట్రార్లకు ఇస్తారు. సబ్ రిజిస్ట్రార్లు వాటిని పరిశీలించి రిజిస్ట్రేషన్ల సమయంలో క్రాస్ చెకింగ్ చేస్తారు. కొత్త విధానంతో రెండు పనులూ ఎమ్మార్వోనే చేయాల్సి వస్తే క్రాస్ చెకింగ్‌కు అవకాశం లేకుండా పోతుంది. ఏటా తప్పని ఖర్చు రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందించాలంటే ఏర్పాట్ల కోసం ఒక్కో మండలంలో రూ.10 లక్షల వరకు అవసరం. ఈ లెక్కన రూ.44.3 కోట్లు ఖర్చవుతాయి. తర్వాత నిర్వహణ కోసం కూడా ఏటా రూ.5 కోట్ల వరకు అదనంగా ఖర్చవుతుంది. ఇది అనవసరపు భారంగా పరిణమిస్తుంది. ఈ యోచన సమంజసం కాదు! కొత్త పాస్ పుస్తకాలు రైతులకు ఇబ్బంది లేకుండా సకాలంలో అందించాలంటే.. రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖలను ఎలక్ట్రానిక్ అనుసంధానం చేస్తే సరిపోతుంది. ప్రభుత్వం అప్పటికీ చేయాలనుకుంటే రిజిస్ట్రేషన్ల చట్టానికి అనుగుణంగా ప్రతి మండలానికి, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలి. -
మెడి‘కిల్స్’!
-వైద్యశాఖలో వందలాది పోస్టుల ఖాళీ - వేధిస్తున్న డాక్టర్లు, సిబ్బంది కొరత - పేదలకందని వైద్య సేవలు - భయపెడుతున్న స్వైన్‌ఫ్లూ లాంటి పమాదకర వ్యాధులు చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వందలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ప్రమాదకర వ్యాధులు ప్రజల్ని భయపెడుతున్నా పట్టించుకునేవారు లేరు. దాదాపు గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పర్యవసానంగా పేదలు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఇలాంటి ప్రమాదకర వ్యాధులపై అవగాహన కల్పించి ప్రజల్ని చైతన్య పరచాల్సిన వైద్య ఆరోగ్య శాఖ ఏమీ చేయలేని పరిస్థితుల్లో చేతులెత్తేసింది. మరోవైపు వ్యాధి నిరోధకానికి అవసరమైన మందులు, మాస్క్‌లు, టెస్టింగ్ కిట్లు తగినన్ని సరఫరా చేయడంలోనూ ఆ శాఖ విఫలమైంది. గాలి ద్వారా వ్యాపించే వైరస్‌ను తట్టుకునేందుకు అవసరమైన రెస్ప్విలేటర్ మాస్క్‌లతోపాటు ఓసెల్టామిర్ (టామీఫ్లూ) 78 మిల్లీ గ్రాముల మాత్రలు తగినన్ని సరఫరా చేయలేదు. సిరఫ్‌లు, టెస్టింగ్ కిట్ల కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో పేద రోగులు ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయించి ఆర్థికంగా చితికిపోవాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లావ్యాప్తంగా సిబ్బంది కొరత జిల్లాలో 94 పీహెచ్‌సీలు, 644 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వైద్యులతో పాటు సిబ్బంది పోస్టులు 2,302 ఉండగా, 1,741 మంది మాత్రమే ప్రస్తుతం విధుల్లో ఉన్నారు. మిగిలిన 560 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏపీవీవీపీల్లో 55కు పైగా వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నియోజకవర్గాల వారీగా తంబళ్లపల్లెలో ఆరు పీహెచ్‌సీలు, ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉండగా, ఆరుగురు డాక్టర్లు, 13 మంది ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సు పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కుప్పంలో 9 పీహెచ్‌సీలు, 56 ఉపఆరోగ్య కేంద్రాలుండగా 26 ఏఎన్ఎం పోస్టులు, నాలుగు డాక్టర్ పోస్టులు, పీలేరులో ఆరు పీహెచ్సీలుండగా ఐదు పీహెచ్‌సీలకు డాక్టర్లు, పుంగనూరులో 9 పీహెచ్‌సీల పరిధిలో డాక్టర్లతో పాటు ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పూతలపట్టులో పి.కొత్తకోట, బంగారుపాళెంలోని ఆస్పత్రుల పరిధిలో పూర్తిస్థాయిలో డాక్టర్లు లేరు. పలమనేరులో వంద పడకల ఆస్పత్రితోపాటు ఏడు పీహెచ్‌సీల పరిధిలో డాక్టర్లు, సిబ్బంది కొరత అక్కడి రోగులను వేధిస్తోంది. జీడీనెల్లూరు పరిధిలో 8 పీహెచ్సీలుండగా వెదురుకుప్పం, పెనుమూరు ఆస్పత్రుల్లో వైద్యులు, ఏఎన్ఎంల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చంద్రగిరిలో ఏడు పీహెచ్‌సీల పరిధిలో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉంది. మదనపల్లెలో ఏడు పీహెచ్సీలుండగా వైద్యులు సక్రమంగా అందుబాటులో లేరు. నగరిలో నాలుగు పీహెచ్సీలుండగా డాక్టర్లు, సిబ్బంది కొరత ఉంది. సత్యవేడులో రెండు పీహెచ్సీ పరిధిలో డాక్టర్లు, సిబ్బంది కొరత ఉంది. చిత్తూరులోనూ స్టాఫ్ నర్సుతోపాటు పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శ్రీకాళహస్తిలో ఐదు పీహెచ్సీలుండగా డాక్టర్లు, సిబ్బంది కొరత ఉంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి.