-వైద్యశాఖలో వందలాది పోస్టుల ఖాళీ
- వేధిస్తున్న డాక్టర్లు, సిబ్బంది కొరత
- పేదలకందని వైద్య సేవలు
- భయపెడుతున్న స్వైన్‌ఫ్లూ లాంటి పమాదకర వ్యాధులు
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వందలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ప్రమాదకర వ్యాధులు ప్రజల్ని భయపెడుతున్నా పట్టించుకునేవారు లేరు. దాదాపు గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పర్యవసానంగా పేదలు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది.
ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఇలాంటి ప్రమాదకర వ్యాధులపై అవగాహన కల్పించి ప్రజల్ని చైతన్య పరచాల్సిన వైద్య ఆరోగ్య శాఖ ఏమీ చేయలేని పరిస్థితుల్లో చేతులెత్తేసింది. మరోవైపు వ్యాధి నిరోధకానికి అవసరమైన మందులు, మాస్క్‌లు, టెస్టింగ్ కిట్లు తగినన్ని సరఫరా చేయడంలోనూ ఆ శాఖ విఫలమైంది. గాలి ద్వారా వ్యాపించే వైరస్‌ను తట్టుకునేందుకు అవసరమైన రెస్ప్విలేటర్ మాస్క్‌లతోపాటు ఓసెల్‌టామిర్ (టామీఫ్లూ) 78 మిల్లీ గ్రాముల మాత్రలు తగినన్ని సరఫరా చేయలేదు. సిరఫ్‌లు, టెస్టింగ్ కిట్ల కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో పేద రోగులు ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయించి ఆర్థికంగా చితికిపోవాల్సిన దుస్థితి నెలకొంది.
జిల్లావ్యాప్తంగా సిబ్బంది కొరత
జిల్లాలో 94 పీహెచ్‌సీలు, 644 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వైద్యులతో పాటు సిబ్బంది పోస్టులు 2,302 ఉండగా, 1,741 మంది మాత్రమే ప్రస్తుతం విధుల్లో ఉన్నారు. మిగిలిన 560 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏపీవీవీపీల్లో 55కు పైగా వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నియోజకవర్గాల వారీగా తంబళ్లపల్లెలో ఆరు పీహెచ్‌సీలు, ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉండగా, ఆరుగురు డాక్టర్లు, 13 మంది ఏఎన్‌ఎంలు, స్టాఫ్ నర్సు పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కుప్పంలో 9 పీహెచ్‌సీలు, 56 ఉపఆరోగ్య కేంద్రాలుండగా 26 ఏఎన్‌ఎం పోస్టులు, నాలుగు డాక్టర్ పోస్టులు, పీలేరులో ఆరు పీహెచ్‌సీలుండగా ఐదు పీహెచ్‌సీలకు డాక్టర్లు, పుంగనూరులో 9 పీహెచ్‌సీల పరిధిలో డాక్టర్లతో పాటు ఏఎన్‌ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పూతలపట్టులో పి.కొత్తకోట, బంగారుపాళెంలోని ఆస్పత్రుల పరిధిలో పూర్తిస్థాయిలో డాక్టర్లు లేరు. పలమనేరులో వంద పడకల ఆస్పత్రితోపాటు ఏడు పీహెచ్‌సీల పరిధిలో డాక్టర్లు, సిబ్బంది కొరత అక్కడి రోగులను వేధిస్తోంది. జీడీనెల్లూరు పరిధిలో 8 పీహెచ్‌సీలుండగా వెదురుకుప్పం, పెనుమూరు ఆస్పత్రుల్లో వైద్యులు, ఏఎన్‌ఎంల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చంద్రగిరిలో ఏడు పీహెచ్‌సీల పరిధిలో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉంది. మదనపల్లెలో ఏడు పీహెచ్‌సీలుండగా వైద్యులు సక్రమంగా అందుబాటులో లేరు. నగరిలో నాలుగు పీహెచ్‌సీలుండగా డాక్టర్లు, సిబ్బంది కొరత ఉంది. సత్యవేడులో రెండు పీహెచ్‌సీ పరిధిలో డాక్టర్లు, సిబ్బంది కొరత ఉంది. చిత్తూరులోనూ స్టాఫ్ నర్సుతోపాటు పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శ్రీకాళహస్తిలో ఐదు పీహెచ్‌సీలుండగా డాక్టర్లు, సిబ్బంది కొరత ఉంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి.
మెడి‘కిల్స్’!
Published Wed, Feb 11 2015 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 9:06 PM
Advertisement
Advertisement