సీనియర్ ఐఏఎస్‌లకు మరిన్ని అదనపు బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్‌ల కొరతతో ఇప్పటికే పలు శాఖల అదనపు బాధ్యతలతో ఇబ్బంది పడుతున్న సీనియర్ అధికారులకు ప్రభుత్వం మరికొన్ని అదనపు శాఖల బాధ్యతలు అప్పగించింది. ఐదుగురు అధికారులకు ఈ బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ ఇప్పటికే అటవీశాఖ ముఖ్యకార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తుంటే.. తాజాగా మారుమూల ప్రాంత అభివృద్ధి శాఖతోపాటు వర్షాభావ ప్రాంతాల అభివృద్ది శాఖను కూడా పర్యవేక్షిస్తారు.
సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌మిశ్రాకు హోంశాఖ అదనపు బాధ్యతలు ఇదివరకు ఉంటే.. తాజాగా సాధారణ పరిపాలన శాఖ (అకామిడేషన్స్)ను, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్యకు అదనంగా పశు సంవర్దకశాఖ ముఖ్యకార్యదర్శిగా, పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి సవ్యసాచి ఘోష్‌కు పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖను, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్‌గా ఉన్న బి.జనార్దన్‌రెడ్డి ఇప్పటికే వ్యవసాయ, ఉద్యాన, మత్స్యశాఖల కమిషనర్‌గా వ్యవహరిస్తుంటే.. తాజాగా సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ బాధ్యతను కూడా అప్పగించారు.