కాలినడక భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం: కనుమూరి బాపిరాజు
విజయవాడ, న్యూస్‌లైన్: తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు ఒక లడ్డూ ప్రసాదం ఉచితంగా ఇచ్చేందుకు త్వరలో టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకోనున్నట్లు టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు చెప్పారు. విజయవాడలోని భక్తులు మండవ కుటుంబరావు ఆధ్వర్యంలో తిరుమలలో నిత్యాన్నదానానికి ఉచితంగా కూరగాయలు పంపుతున్న వాహనాన్ని బుధవారం బాపిరాజు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల వచ్చే భక్తులకు మౌలిక వసతులను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. రోజూ 50 వేలమంది భక్తులకు స్వామివారి అన్న ప్రసాదాన్ని ఉచితంగా అందజేస్తున్నామన్నారు. అన్న ప్రసాదానికి వినియోగించే బియ్యాన్ని రైస్ మిల్లర్ల సంఘాల నుంచి కొనుగోలు చేయడం వలన కోట్లాది రూపాయలు ఆదా కావడంతోపాటు, నాణ్యతా ప్రమాణాలు గల బియ్యాన్ని పొందగలుగుతున్నామని చెప్పారు. తిరుమల అన్నప్రసాదానికి ప్రవాసాంధ్రులు అరవపల్లి శేషసాయివర్మ, కావ్య, ఆదిత్య, మండవ సత్య పదిటన్నుల కూరగాయలను ఉచితంగా అందించినట్లు తెలిపారు. భక్తులు ఉచితంగా కూరగాయలు ఇస్తే టీటీడీ రవాణా వాహనాన్ని సమకూర్చడంతోపాటు, టోల్గేట్లు, ఆయిల్ ఖర్చులు కూడా భరిస్తుందని చెప్పారు.