జిల్లా ఏర్పాటులో అందరి కృషి
వనపర్తి టౌన్ : వనపర్తి జిల్లా ఏర్పాటులో ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఆమరణ దీక్షతోపాటు.. ఇతర పార్టీల నాయకుల కృషి సైతం ఉందని కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి, పార్టీ పట్టణ అధ్యక్షుడు శంకర్‌ప్రసాద్, పార్టీ మండలాధ్యక్షుడు తిరుపతయ్య అన్నారు. వనపర్తి జిల్లా ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, అఖిలపక్ష నాయకులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వారు పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వనపర్తి జిల్లా ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం పట్టణంలో తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైన బోనాల వేడుకలను పెద్దఎత్తున నిర్వహించాలని నిర్ణయించామన్నారు. పట్టణంలోని మహిళలందరూ అధిక సంఖ్యలో పాల్గొని జిల్లా ఏర్పాటుపై సంతోషాన్ని, మన సంస్కృతిని మరోమారు ప్రజానీకానికి తెలియజేసేందుకు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శ్యాం, మహిళా నాయకురాళ్లు లీలావతి, జయమ్మ, నాయకులు జాన్, చిన్నరాజు, వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.