భారత మహిళలకు పరాజయం
డెన్ బోష్ (నెదర్లాండ్స్): తమ యూరోప్ పర్యటనలో భాగంగా ఆడిన మూడో మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టుకు ఘోర పరాజయం ఎదురైంది. శుక్రవారం లేడీస్ డెన్ బోష్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 1–3 గోల్స్ తేడాతో ఓడింది. డిఫెండర్ నవ్‌దీప్ కౌర్ 47వ నిమిషంలో జట్టు తరఫున ఏకైక గోల్ చేసింది. మ్యాచ్ ఆరంభమైన పది నిమిషాలు భారత్ ఆధిపత్యం చూపింది.
ఆ తర్వాత ప్రత్యర్థి జట్టు ఎదురుదాడికి దిగింది. 12వ నిమిషంలో తమకు లభించిన పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకుని లేడీస్ డెన్బోష్ జట్టు తొలి గోల్ సాధించింది. అదే జోరులో మరో రెండు గోల్స్ చేసి 3–0తో ముందంజ వేసింది. చివరి క్వార్టర్లో భారత్ బోణీ చేయగలిగింది. ఈనెల 18న బెల్జియం జూనియర్ పురుషుల జట్టుతో టీమిండియా చివరిదైన నాలుగో మ్యాచ్ ఆడనుంది.