తాధిమి తకధిమి తోలుబొమ్మ..
తోలుబొమ్మలాట చూడటానికి తమాషాగా ఉంటుంది. తాతల నాడు నాలుగు దిక్కుల నడిమి సంతలో ఆడిపాడిన ఈ జానపద కళారూపం.. మళ్లీ పట్నంలో తైతక్కలాడుతోంది. మరమనుషులు ముస్తాబవుతున్న ఈ రోజుల్లో.. మళ్లీ తెరమీదకు వస్తున్నాయి తోలుబొమ్మలు. సాంకేతికత కలబోసుకున్న సినిమాలు ఇవ్వని సందేశాన్ని.. కళాత్మక తోలు బొమ్మలాట అందిస్తోంది.. ఆలోచింపచేస్తోంది.
సినిమాలు, పబ్‌లు, మ్యూజిక్ నైట్స్.. ఆటవిడుపనుకునే సిటీవాసులకు అసలైన వినోదాన్ని అందిస్తున్నాయిపప్పెట్ షోలు. నీతి కథలు, కుటుంబంతో వ్యవహరించాల్సిన తీరు, సామాజిక సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలి.. ఇలా అనేక సందేశాత్మక ప్రదర్శనలతో అదరహో అనిపించుకుంటున్నాయి.
సలామ్ పప్పెట్స్..
పప్పెట్ షోస్‌కు సిటీ సలామ్ చేస్తోంది. పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు చదువు ప్రాముఖ్యాన్ని తెలిపేలా ‘తోలు బొమ్మలాట’ ద్వారా అవగాహన కల్పించే ట్రెండ్ ఈ మధ్యే సిటీలో మొదలైంది. వినోదం, సాంకేతికత, హాస్యం, నృత్యం, సందేశం.. ఇలా అన్నీ కలగలసిన ఈ కళ ద్వారా శ్రోతలకు సరైన ఆనందంతో పాటు మానసిక వికాసానికీ దోహదం చేస్తుంది. లెదర్ షాడో పప్పెట్, రాడ్ పప్పెట్, స్ట్రింగ్ పప్పెట్, హ్యాండ్ పప్పెట్ వంటి షోలు పాతతరం ట్రెండ్‌కు కొత్త సొబగులు అద్దుతున్నాయి.
ఇంకా ప్రోత్సాహం కావాలి...
‘పప్పెట్ షోలకు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. అందరూ నయా టెక్నాలజీ వైపే పరుగులు తీస్తుండటంతో వీటి గురించి పెద్దగా ఎవరికీ తెలియడం లేదు. వీటిని ప్రోత్సహించాల్సిన అవసరం అందరిపై ఉంద’ని అంటున్నారు నోరీ ఆర్ట్ అండ్ పప్పెట్రీ సెంటర్ (ఎన్‌ఏపీసీ) వ్యవస్థాపకురాలు రత్నమాల నోరీ.
ద లేడీ ఇన్ ద మిర్రర్..
బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లో శనివారం ఏఆర్డీఎస్ఐ హైదరాబాద్ డెక్కన్ చాప్టర్ ఆధ్వర్యంలో జరిగిన ‘ద లేడీ ఇన్ ద మిర్రర్’ పప్పెట్ షో ఆద్యంతం హాస్యభరితంగా సాగింది. కథాంశంలోకి వెళ్తే అల్జీమర్స్ (మతిమరుపు) ఉండే ఓ పెద్దావిడ ఇంటికి పెళ్లి ఆహ్వానం అందుతుంది. ఆమెకు అద్దం ముందు నిలబడి మాట్లాడే అలవాటు ఉంటుంది. కుటుంబ సభ్యులు ఎలాగైనా ఆమెని పెళ్లికి తీసుకురావాలని అనుకుంటారు. అప్పటి నుంచి ఆ పెద్దావిడ తనకింకా పెళ్లికాలేదని, ఆ పెళ్లి తనకేనని అనుకుంటుంది. ఆ గ్రాండ్‌మాను కుటుంబసభ్యులు ఎదుర్కొన్న తీరును కళ్ల ముందుంచింది ఈ షో. అల్జీమర్‌తో బాధపడుతున్న వారిని ప్రేమగా చూసుకోవాలన్న సందేశాన్ని ఇలా కళాత్మకంగా వివరించారు.
..:: వాంకె శ్రీనివాస్