మహిళ హత్యకేసులో ఒకరికి జీవితఖైదు
రంగారెడ్డి: డబ్బు కోసం ఓ యువతిని హత్య చేసిన నిందితునికి జీవితఖైదుతో పాటు రూ. వెయ్యి జరిమానా విధిస్తూ 3వ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జీ గురువారం తీర్పునిచ్చారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేష్ కథనం ప్రకారం... కర్మన్‌ఘాట్ శ్రీనిధికాలనీలో నివాసముండే శ్వేత అక్క వద్ద ఉంటూ చదువుకుంటోంది. జనవరి 27, 2009న దూరపు బంధువైన శేఖర్‌రెడ్డి శ్వేత ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో డబ్బుల విషయంలో శ్వేత, శేఖర్‌రెడ్డిల మధ్య గొడవ జరిగింది. దీంతో క్షణికావేశానికి లోనైన శేఖర్‌రెడ్డి బీరు బాటిల్, ఐరన్ రాడ్‌తో శ్వేత తలపై మోది హతమార్చాడు.
విషయం తెలుసుకున్న శ్వేత సోదరుడు క్రాంతికుమార్‌రెడ్డి సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడైన శేఖర్‌రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించి కోర్టులో అభియోగపత్రం నమోదు చేశారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 6వ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జీ జస్టిస్ వెంకటప్రసాద్ నిందితుడికి జీవితఖైదుతో పాటు జరిమానా విధించారు.