ఓటరు జాబితాలో 66చోట్ల ఒకే వ్యక్తి పేరు
సాక్షి, ముంబై: మోటే లక్ష్మణ్‌దాస్ హిరా చందాని.. పేరు కల్యాణ్ లోక్‌సభ నియోజకవర్గ ఓటరు జాబితాలో ఏకంగా 66 చోట్ల ప్రత్యక్షమైంది. అయితే తన పేరుతో ఉన్న వేర్వేరు వ్యక్తులుగా ముందు భావించిన మోటే పక్కన గుర్తింపు నంబర్ కూడా అదే ఉండడంతో అవాక్కయ్యాడు. అయితే జాబితాలో 66 చోట్ల ఫొటోలు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి. కొన్ని చోట్ల తన పేరు, పక్కన మహిళ ఫొటో కూడా ఉంది. దీంతో మోటే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే ఓటింగ్ జరుగుతుండడంతో అధికారులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఈ నెల 24న రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
ఓటరు జాబితాలో తన పేరు ఉందో? లేదో? ఉంటే తన పోలింగ్ బూత్ ఎక్కడ? తదితర వివరాలను తెలుసుకునేందుకు భారత ఎన్నికల సంఘం ప్రారంభించిన వెబ్సైట్లో మోటే తన పేరును వెతుక్కుంటుండగా అసలు విషయం తెలిసొచ్చింది. తన పేరు మాత్రమే కాకుండా, తనకు కేటాయించిన గుర్తింపు నంబర్‌తో ఏకంగా 66 మంది ఉన్నట్లు గుర్తించాడు. అయితే పక్కన ఉన్న ఫొటోలు వేర్వేరు వ్యక్తులవి ఉండడంతో అధికారుల నిర్లక్ష్యం కారణంగా జరిగిన పొరపాటుగా భావించి ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అయినా అప్పటికే సమయం మించిపోవడంతో అధికారులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఇదిలాఉండగా ఒకే వ్యక్తి పేరు జాబితాలో 66సార్లు కనిపించగా వందలాది మంది పేర్లు అసలు జాబితాలో కనిపించకుండా పోయాయి. ఇలా ఒకే వ్యక్తి పేరు పలుమార్లు రావడంతో అసలు ఉండాల్సిన పేర్లు గల్లంతయ్యాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.