లక్ష ఎకరాల వెనుక.. లక్ష్యం ఏమిటో?
జిల్లాలో భూసేకరణకు ప్రభుత్వం ఆదేశాలు
ఏపీఐఐసీ నేతృత్వంలో జరపాలని సూచన
పరిశ్రమల కోసమని పేర్కొనడంపై అనుమానాలు
రికార్డుల్లో ఉన్నా.. క్షేత్రస్థాయిలో కానరాని భూములు
పేదలు, ప్రైవేట్ భూములపై పడతారని ఆందోళన
శ్రీకాకుళం : పారిశ్రామిక అవసరాల పేరుతో జిల్లాలో లక్ష ఎకరాల భూమి సేకరణకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేపట్టడంతో రైతులు, వివిధ ప్రభుత్వ పథకాల కింద భూములు పొందిన లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. భూ సేకరణకు సంబంధించి రెండు రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెవెన్యూ, పరిశ్రమల శాఖలకు ఉత్తర్వులు అందాయి. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో భూ సేకరణ జరపాలని ఆ ఉత్తర్వుల్లో సూచించిన ప్రభుత్వం ఏ రకమైన భూములు సేకరించాలో స్పష్టం చేయలేదు. పైగా జిల్లాలో ఆ స్థాయిలో ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ భూములు, పేదలకు పంపిణీ చేసిన భూములను లాక్కుంటారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతానికి ప్రభుత్వ భూముల వివరాలు సేకరించాలని అధికారులు నిర్ణయించారు.
రికార్డుల్లో 4 లక్షల ఎకరాలు
రెవెన్యూ రికార్డుల ప్రకారం జిల్లాలో 4,08,361.4 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు తెలుస్తోంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు విడతల భూ పంపిణీ కార్యక్రమంలో పేదలకు 1.04 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసింది. అలాగే పక్కా ఇళ్ల నిర్మాణాలు, ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అభివృద్ధి పనులు, భవనాలకు మరొకొంత భూమి కేటాయించారు. కొంత భూమి వివాదాల్లోనూ, మరికొంత ఆక్రమణల్లోనూ ఉంది. ఇవన్నీ పోనూ మరో రెండు లక్షల ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉన్నట్టు రికార్డుల ద్వారా తెలుస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో అంత భూమి ఎక్కడా కనిపించడంలేదు. గత ప్రభుత్వం భూపంపిణీ సందర్భంగా ప్రభుత్వ భూమిని సేకరించాలని ఆదేశించినప్పుడే అధికారులకు ఎన్నో తలనొప్పులు ఎదురయ్యాయి.
రికార్డుల్లో ఉన్న భూములు క్షేత్రస్థాయిలో కనిపించలేదు. ఇక వివాదస్పద, ఆక్రమిత భూములను సేకరించడం అధికారుల తలకు మించిన పనే. ఈ నేపథ్యంలో జిల్లాలో పరిశ్రమల స్థాపనకు వీలుగా లక్ష ఎకరాలు సేకరించి సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారవర్గాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. లక్ష ఎకరాలు అవసరమైనన్ని పరిశ్రమలు స్థాపించే ప్రతిపాదనలేవీ లేవు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ప్రాజెక్టులకు అంత భూమి అవసరం లేదు. మరి అంత భూమి ఎందుకు?.. ఈ ప్రశ్నకు సమాధానమా అన్నట్లు పరిశ్రమల స్థాపన పేరిట పచ్చచొక్కాలకు భూసంతర్పణ చేసేందుకేనన్న ఆరోపణలు వెల్లువె త్తుతున్నాయి.
లబ్ధిదారుల ఆందోళన
కాగా ప్రభుత్వ భూములు అందుబాటులో లేకుంటే ప్రైవేటు భూములపై పడతారేమోనన్న ఆందోళన రైతుల నుంచి వ్యక్తమవుతోంది. అటవీ భూములను సేకరించే అవకాశాలు కూడా లేవు. జిల్లా వైశాల్యంలో అటవీ ప్రాంత నిష్పత్తిని చూస్తే ఇప్పటికే 20 శాతం కంటే తక్కువ అటవీ ప్రాంతం ఉంది. ప్రైవేటు భూములతోపాటు గత ప్రభుత్వం భూపంపిణీలో భాగంగా పేదలకు ఇచ్చిన భూములను తిరిగి తీసుకుంటారేమోనని లబ్ధిదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ విషయాన్ని ఏపీఐఐసీ జిల్లా మేనేజర్ సత్యనారాయణ వద్ద ఁసాక్షిరూ. ప్రస్తావించగా భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం వాస్తవమేనన్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉందని జిల్లా అధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటామని తెలిపారు. భూమిని సేకరించి పరిశ్రమల స్థాపనకు సిద్ధంగా ఉండాలని మాత్రమే తమకు అందిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారని చెప్పారు.