చేపపిల్లల సరఫరాకు టెండర్లు ఖరారు
మహబూబ్నగర్ న్యూటౌన్ : జిల్లాలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు వందశాతం సబ్సిడీపై చేపపిల్లలు సరఫరా చేసేందుకుగాను సోమవారం టెండర్లను ఖరారు చేశారు. ఈ మేరకు జేసీ రాంకిషన్ సమక్షంలో టెండరుదారుల దరఖాస్తులను పరిశీలించారు. లక్ష చేపపిల్లల కోసం ఆరుగురు టెండర్లు దాఖలు చేయగా, రూ.79,900లకు కోట్ చేసిన ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా భుజబలికి చెందిన ఫణీంద్రవర్మను ఎంపిక చేశారు.
నిబంధనల ప్రకారం జిల్లాలోని 609 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల పరిధిలోని చెరువులు, 15 రిజర్వాయర్లలో ఈ చేపపిల్లలను వదలాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో కొనుగోలు కమిటీ సభ్యులు మత్స్య శాఖ ఏడీ ఖదీర్అహ్మద్, పశుసంవర్ధక శాఖ జేడీ దుర్గయ్య, డీఐఓ మూర్తి, సెట్మా సీఈఓ హన్మంతరావు పాల్గొన్నారు.