లక్ష మందికి శిక్షణ
• పరిశ్రమలకు ,కళాశాలలకు అనుసంధానం
• ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్ కార్యదర్శి గంటా సుబ్బారావు
ఎస్కేయూ : రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ , పీజీ లక్ష మంది విద్యార్థులకు నైపుణ్యాలు పెంపొందించేందుకు శిక్షణ ఇవ్వనున్నామని ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్ కార్యదర్శి గంటా సుబ్బారావు అన్నారు. ఎస్కేయూ అనుబంధ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్, యాజమాన్యాలకు గురువారం వర్సిటీలో ‘ ఉద్యోగ అవకాశాలు పెంపొందించడానికి అనుసరించాల్సిన పద్ధతులు ’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. గంటా సుబ్బారావు ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఇప్పటి వరకు 1069 మంది విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపికయ్యారని తెలిపారు.
నైపుణ్యాలు పెంపొందించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 200 డిగ్రీ కళాశాలల్లో తగిన సదుపాయాలు కల్పిస్తామన్నారు. ట్యాలీ, ఎస్ఏపీ, టెస్టింగ్ టూల్స్, ఆండ్రాయిడ్ ట్రైనింగ్, కంప్యూటర్, తదితరాలకు సంబంధించి విద్యార్థులకు నచ్చిన అంశంలో శిక్షణ ఇస్తారన్నారు. ఎస్కేయూ వీసీ ఆచార్య కే.రాజగోపాల్ మాట్లాడుతూ స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్ ద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు. ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్ ప్రిన్సిపల్ కన్సెల్టెన్స్ డాక్టర్ ఎం. శైలజ, ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్యాంమోహన్, విన్సెంట్, ఎస్కేయూ సీడీసీ డీన్ ఆచార్య లక్ష్మీదేవి, ఎస్కేయూ స్కిల్‌డెవలప్‌మెంట్ డైరెక్టర్ ఆచార్య బి. నాగభూఫణ రాజు తదితరులు పాల్గొన్నారు.