లంబాడీలను మోసం చేసిన కేసీఆర్‌ను ఓడించాలి
హైదరాబాద్: ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మోసం చేసిన సీఎం కేసీఆర్‌ను ఎన్నికల్లో ఓడించాలని కేరళ క్యాడర్ ఐజీ లక్ష్మణ్‌నాయక్ లంబాడీలకు పిలుపునిచ్చారు. సేవాళాల్ బంజార సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కొర్ర మోతిలాల్ అధ్యక్షతన ఐఎస్‌సదన్ డివిజన్ సింగరేణి కాలనీలో లంబాడీ ప్రజా చైతన్యయాత్ర కార్యక్రమం వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. అక్టోబర్ 1 నుంచి రిజర్వేషన్ల సాధనకు 15 నియోజకవర్గాల్లో ఈ యాత్ర సాగనుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన లక్ష్మణ్‌నాయక్ మాట్లాడుతూ..ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను కూడా తండాల అభివృద్ధికి కేటాయించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పార్టీలు లంబాడీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని, రిజర్వేషన్లు కల్పిస్తామన్నవారికే వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని సూచించారు.
రాష్ట్రంలో 70 నియోజకవర్గాలను లంబాడీలు ప్రభావితం చేయగలరని, ప్రతి పార్టీ లంబాడీలకు 10 ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో విద్యుత్‌శాఖలో డీఈ కోటేశ్వర్‌రావుతో పాటు సంఘం రాష్ట్ర నాయకులు మోతిలాల్‌నాయక్, గాంధీనాయక్, జుక్కిబాయి, సక్రిబాయి, తార్యనాయక్, తుకారంనాయక్, లచ్చిరాంనాయక్, రాంలాల్, హరినాయక్, గణేశ్, తిరుపతి, విక్రం పాల్గొన్నారు.