కరువు ముంగిట్లో లక్ష్మాపూర్
వానలు లేక బోసిపోతున్న చెరువులు, కుంటలు
వరద నీటికీ నోచుకోని గ్రామం
ముందుకు సాగని సాగు పనులు
ఆందోళనలో రైతులు
జోగయ్య ఒర్రె నుంచి కాలువ తీయాలని వినతి
రామాయంపేట: ‘వాన దేవుడు మా ఊరిపై కన్నెర్ర జేసిండా’.. అని లక్ష్మాపూర్ వాసులు ఆందోళన చెందుతున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో వానలు పడుతున్నా మా ఊర్లో మాత్రం లేవని వారంటున్నారు. వానలు లేక వరద నీరు రాక రెండు చెరువులూ బోసిపోయాయని వాపోతున్నారు. ఇప్పటికైనా కరుణించవా వాన దేవుడా.. అంటూ వేడుకుంటున్నారు.
మండలంలోని లక్ష్మాపూర్ గ్రామం కరువుతో విలవిలలాడుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో ఇతర గ్రామాల్లోని చెరువుల్లోకి కొంతమేర నీరు చేరగా, ఇక్కడ మాత్రం ఉన్న రెండు చెరువులూ బోసిపోయాయి. ఈ చెరువుల్లోకి చుక్కనీరు చేరకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో వ్యవసాయ పనులు ఊపందుకోగా, ఇక్కడ మాత్రం నెమ్మదిగా కొనసాగుతున్నాయి.
అటవీప్రాంతాన్ని ఆనుకునే ఉన్న ఊర చెరువు, మైసమ్మ చెరువు చిన్నపాటి వర్షాలకే నీటితో నిండి కళకళలాడాల్సిందిపోయి చుక్క నీరు చేరకపోవడంతో కనీసం పశువులు తాగడానికి సైతం నీరు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామ పరిధిలో భూగర్భ జలాలు పూర్తిగా తగ్గిపోయి వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంలో చిన్న చినుకులు కురిసినా అటవీప్రాంతం నుంచి వరద నీరు చెరువుల్లోకి చేరేదని రైతులు గుర్తు చేస్తున్నారు.
అటవీ ప్రాంతంలోని జోగయ్య ఒర్రె నుంచి కాలువ తీస్తేనే...
లక్ష్మాపూర్, కాట్రియాల పరిధిలోని అటవీప్రాంతంలోని జోగయ్య ఒర్రె ప్రాంతం నుంచి ప్రత్యేకంగా కాలువ తీస్తేనే ఈ రెండు చెరువుల్లోకి నీరు చేరే అవకాశం ఉంది. నాలుగైదేళ్ల క్రితం చేపట్టినన ఈ కాలువ తవ్వకం పనులు అటవీ శాఖ వారు మధ్యలోనే నిలిపివేశారు. దీంతో ఈ చెరువులోకి చుక్క నీరు చేరడంలేదు. నాలుగైదేళ్లుగా చెరువులు నిండక తాము ఇబ్బందులపాలవుతున్నామని రైతులు వాపోతున్నారు. వర్షాలు కురిస్తే ఈ చెరువుల్లోకి నీరు వచ్చే కాలువలు పూర్తిగా పూడుకుపోవడం కూడా మరో కారణమని స్థానికులు చెబుతున్నారు.
కాలువ తవ్వించాలి
నాలుగేళ్ల నుంచి ఊరి పక్కన ఉన్న రెండు చెరువులకు చుక్క నీరు వస్తలె. గోదలు తాగేతందుకు కూడా నీళ్లు దొరుకుతలె. చెరువులు మైదానం లెక్క అయినయి. బోర్లు కూడా పోస్తలేవు. అడవిల ఉన్న జోగయ్య ఒర్రెనుంచి చెరువులకు కాలువ తీస్తేనే నిండుతయి. లేకపోతే ఇట్లనే ఉంటయి. - సైదు పెద్ద సిద్దయ్య, రైతు
వరద నీళ్లు చెర్లకు మళ్లించాలి
అడవిల పడ్డ నీళ్లు సుక్క కూడా రెండు చెర్లకు వస్తలేవు. వర్షం నీళ్లు పెద్ద వరద ఊరి పక్కనుంచే వృథాగా పోతున్నయి. ఈ వరద నీళ్లను రెండు చెర్లకు మళ్లించేతందుకు కాలువ తీయించి ఆదుకోవాలి. బోర్లు నీళ్లు పోస్తలేవు. వెంటనే కాలువ తీయించేతందుకు సార్లు ఆడర్ ఇయ్యాలి. - కాసుల కిషన్, గ్రామ రైతు
వానలు లేక చెర్లకు నీళ్లు రాలె
చుట్టుపక్కల వానలు పడుతున్నా.. మా ఊరిలో పడుతలెవ్వు. రెండు చెర్లల్ల సుక్క నీరు రాలేదు. బోర్లల్ల నీళ్లు సరిగా రాక చాలామంది నాట్లు ఏస్తలేరు. చెరువులు నింపితేనే మేము బతికేది. గత నాలుగైదేళ్లుగా చెర్లు నిండక మస్తు కష్టపడుతున్నం. సర్కారు ఆదుకోవాలి.- యాకం దుర్గయ్య, రైతు
కాలువ నిర్మాణానికి చర్యలు
లక్ష్మాపూర్ గ్రామంలో వర్షపాతం తక్కువగా నమోదైంది. సరైన వర్షాలు కురవలేదు. గ్రామంలోని రెండు చెరువులకు నీరు చేరలేదు. వరద రాలేదని స్థానికులు నా దృష్టికి తెచ్చారు. జోగయ్య ఒర్రెనుంచి చెరువులకు కాలువ తీసేందుకు గాను సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించాం. త్వరలో పనులు మొదలయ్యేలా చర్యలు తీసుకుంటా. - పద్మాదేవేందర్రెడ్డి, డిప్యూటీ స్పీకర్