హాల్ టిక్కెట్ కోసం వెళ్లి..విద్యార్థిని అదృశ్యం
హైదరాబాద్ (చాంద్రాయణగుట్ట): కళాశాలకు వెళ్లి హాల్ టిక్కెట్ తెచ్చుకుంటానంటూ ఇంట్లో చెప్పి వెళ్లిన ఓ ఇంటర్ విద్యార్థిని కనిపించకుండా పోయిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఛత్రినాక పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....గౌలిపురా నల్లపోచమ్మ బస్తీకి చెందిన ప్రసాద్ కుమార్తె ఎ.ప్రసన్న లక్ష్మీ(19) ఇంటర్ విద్యార్థిని. గత నెల 21న కాలేజీకి వెళ్లి మొదటి సంవత్సరం సప్లమెంటరీ పరీక్షకు సంబంధించిన హాల్టికెట్ తెచ్చుకుంటానంటూ తల్లికి చెప్పి వెళ్లింది.
రాత్రి వరకు కూడా ప్రసన్న లక్ష్మీ ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు తెలిసిన వారి దగ్గర ఆరా తీశారు. అమ్మాయి ఆచూకీ ఎంతకీ తెలియకపోవడంతో తండ్రి ప్రసాద్ మంగళవారం ఛత్రినాక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆచూకీ తెలిసిన వారు ఛత్రినాక పోలీస్స్టేషన్లో గాని 9490616500 నంబర్లో గానీ సమాచారం అందించాలని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.