వద్దంటావేం నాన్నా..
ఇంటికి నాన్న రాగానే కాళ్లకు అడ్డం పడతారు. మూట కట్టి దాచిన కబుర్లన్నీ చెవిలో వినిపిస్తారు. ఇష్టమైన వస్తువుల జాబితా చిట్టా జేబులో తోస్తారు. ఒడిలో కూర్చుని గారాలు పోతారు. ఏ కూతురైనా నాన్న ప్రేమవర్షంలో తడిసిపోతుంది.. ఆ అదృష్టం ఓ చిట్టితల్లికి దక్కలేదు. ఆ అనురాగం ఆమెపై కురవలేదు. భవిష్యత్తుకు బంగారు బాట వేయలేదు. ప్రయోజకురాలిని చేయాల్సిన నాన్న సహజీవ నాల మోజులో మునిగి తేలుతున్నాడు. కుమార్తె ఉన్నతిని గాలికొదిలేశాడు. తల్లి కన్నుమూసింది. చదువు ఆగిపోయింది.
నాన్న ఆదరణ కరువైపోయింది. అదే ఆమెను కుంగదీసింది. మతిస్థిమితం లేకుండా చేసింది. ఆ అభాగ్యురాలు బుదరువాడ పంచాయతీ, టేకులోవ గ్రామానికి చెందిన విద్యార్థిని సీదరపు లక్ష్మీ సరస్వతి. బాధితురాలి సోదరుడు వెంకటేశ్వర్రావు, పెద్దమ్మ కాంతమ్మలు అందించిన వివరాలకు అక్షర రూపమిది.పార్వతీపురం: సాలూరు మండలం తోణాం స్కూలు కాంప్లెక్స్‌కు చెందిన కొట్టుపరువు కొత్తవలస పాఠశాల ఉపాధ్యాయుడు సీదరపు సన్యాసయ్య దొర తొలుత కాంతమ్మను వివాహం చేసుకున్నాడు.
వీరిద్దరికి సింహాచలం, వెంకటేష్ ఇద్దరు పిల్లలు పుట్టారు. అనంతరం ఆమె సొంత చెల్లెలు గంగమ్మను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి సీతారాం, లక్ష్మీ సరస్వతి పుట్టారు. లక్ష్మీ సరస్వతి స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో పదోతరగతి, ఇంటర్మీడియట్ చదివి అత్యధిక మార్కులు సాధించింది. అనంతరం విజయనగరం గొట్లాం కళాశాలలో డిగ్రీ (బయోటెక్నాలజీ)లో చేరింది. అదే సమయంలో తల్లి కాంతమ్మ మృతి చె ందింది. తండ్రి మరో స్త్రీతో సహజీవనం చేస్తూ బిడ్డల్ని పట్టించుకోవడం మానేశాడు. దీంతో లక్ష్మీసరస్వతి చదువు మధ్యలో ఆగిపోయింది. తండ్రి కనీసం పట్టించుకోకపోవడంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురై మతిస్థిమితం కోల్పోయింది.
కుమార్తె అనారోగ్యంపై స్పందించని తండ్రి
అందం, చదువు, చలాకీతనంతో ఆడుతూపాడుతూ తిరిగే పిల్ల.. ఇప్పుడు నోటమాట రాక.. కేకలు వేస్తుంటే కుటుంబ సభ్యులే కాదు... తెలిసినవారి గుండె తరుక్కుపోతోంది. కుమార్తె ఆరోగ్యం క్షీణిస్తున్నా తండ్రి కరుణించడం లేదు. ఇంటిని పట్టించుకోకపోవడంతో పిల్లల పోషణ కష్టంగా ఉందని బాధితురాలి పెద్దమ్మ కాంతమ్మ, అన్నయ్య వెంకటేశ్వర్రావులు వాపోయారు. ఉపాధ్యాయుడైన సన్యాసయ్య దొర జీతం నుంచి కొత్తమొత్తం నెల నెలా తమకు ఇప్పించాలని ఐటీడీఏ పీఓను కోరేందుకు సోమవారం గ్రీవెన్స్కొచ్చారు. లక్ష్మీసరస్వతి దీనగాథ విన్నవారంతా చలించిపోయారు.