అభివృద్ధి పనులకు అనుమతించాలి: బీజేపీ
న్యూఢిల్లీ: అనధికార కాలనీల క్రమబద్ధీకరణ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఓ ముసాయిదాను రూపకల్పన చేయనుందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాలనీల క్రమబద్ధీకరణకు ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించేందుకు సంబంధించి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా అవసరమైన సూచనలు చేశారన్నారు. 15 రోజుల్లోగా ముసాయిదాను రూపొందించాలంటూ సంబంధిత అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారన్నారు.
కాలనీల క్రమబద్ధీకరణకు కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా అనుమతించాలంటూ తాము కేంద్ర మంత్రిని డిమాండ్ చేశామన్నారు. అనధికార కాలనీల్లో అభివృద్ధి పనులను చేపట్టేందుకు మున్సిపల్ కార్పొరేషన్లను అనుమతించాల్సిందిగా ఈ సందర్భంగా మంత్రిని కోరామన్నారు. ఈ కాలనీల్లో సౌకర్యాలు మెరుగుపడితే అక్కడి ప్రజలకు ఎంతో వెసులుబాటు కలుగుతుందన్నారు. మంత్రి ఆదేశాల మేరకు వచ్చేనెల 30వ తేదీలోగా అన్ని విభాగాలు బెటర్ ఢిల్లీ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో భగంగా నగరవ్యాప్తంగా ల్యాండ్ మ్యాపింగ్ జరుగుతుందన్నారు. ఇందువల్ల పార్కింగ్, పాఠశాలలు, ఆస్పత్రులు,మహిళా హాస్టళ్లు తదితరాలు అందుబాటులోకి వస్తాయన్నారు.