ఆదివారాల్లోనూ రిజిస్ట్రేషన్
* డిమాండ్ ఉన్న చోట కార్యాలయాలు తెరచి ఉంచుతాం
* రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు ఆలోచనలేదు: మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: ఆదివారాల్లోనూ రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. భూమి రిజిస్ట్రేషన్ల డిమాండ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలను తెరచి ఉంచాలని భావిస్తోంది. రంగారెడ్డి, హైదరాబాద్ సహా మరికొన్ని పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ఆదివారాల్లోనూ తెరచి ఉంచేందుకు కసరత్తు చేస్తున్నామని డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు.
గురువారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని 4,300 పోస్టాఫీసుల్లో రిజిస్ట్రేషన్ స్టాంపులను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచే ఆలోచన లేదని మంత్రి స్పష్టం చేశారు. రెండు షిప్టుల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేసే విధానం ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని, క్రమబద్ధీకరణ గడువును అవసరాన్ని బట్టి పొడిగిస్తామని తెలిపారు. నిజాంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు.