Land surveyors
-
గ్రామస్థాయికి భూముల సర్వే సేవలు
సాక్షి, అమరావతి: భూముల సర్వే సేవలను మండలస్థాయి నుంచి గ్రామస్థాయికి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మండల సర్వేయర్ల చేతిలో ఉన్న ఎఫ్ లైన్ పిటిషన్ల (సరిహద్దు వివాదాలు, హద్దులు–విస్తీర్ణంలో తేడాలు వంటివాటిపై వచ్చే దరఖాస్తులు) బాధ్యతను గ్రామ సర్వేయర్లకు అప్పగించింది. రీ సర్వే నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయం ఆ కార్యక్రమం మరింత వేగం పుంజుకోవడానికి, సాధారణంగా సర్వే వ్యవహారాల్లో జరిగే జాప్యాన్ని నివారించడానికి ఎంతో దోహదపడుతుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో తమ భూమికి సంబంధించి హద్దుల్లో ఏమైనా తేడాలు వచ్చినా, విస్తీర్ణంలో తప్పులు చోటుచేసుకున్నా, ఇతరత్రా తమ భూమి గురించి అనుమానాలు నివృత్తి చేసుకోవాలన్నా భూ యజమానులు సర్వేకోసం దరఖాస్తు చేసుకుంటారు. దీనిని రెవెన్యూ పరిభాషలో ఎఫ్ లైన్ పిటిషన్‌గా పిలుస్తారు. ఇప్పటివరకు ఈ సర్వే బాధ్యతను మండల సర్వేయర్లు నిర్వర్తించేవారు. మండలానికి ఒక్కరే సర్వేయర్ ఉండడం, పిటిషన్లు కుప్పలుతెప్పలుగా వస్తుండడంతో సర్వే తీవ్ర జాప్యమవుతుండేది. భూముల రీ సర్వే సందర్భంగా ఎఫ్ లైన్ పిటిషన్లలో జాప్యాన్ని గుర్తించారు. ఇకపై పిటిషన్లు నేరుగా గ్రామ సర్వేయర్ల లాగిన్‌కు... ఈ నేపథ్యంలో ఆ బాధ్యతను మండల సర్వేయర్ల నుంచి గ్రామ సర్వేయర్లకు బదలాయించారు. గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల వెబ్సైట్ ద్వారా వచ్చే ఎఫ్ లైన్ దరఖాస్తులు ఇకపై నేరుగా గ్రామ సర్వేయర్ లాగిన్‌కు చేరతాయి. సర్వేకు నోటీసులు జారీచేయడం, సర్వే నిర్వహించడం, ఆ వివరాలతో నివేదిక తయారు చేసి డిప్యూటీ తహసీల్దార్‌కు పంపడం వంటి పనులన్నీ ఇకపై గ్రామ సర్వేయర్లే చేస్తారు. డిప్యూటీ తహసీల్దార్ ఆ నివేదికను పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. డిప్యూటీ తహసీల్దార్ డిజిటల్ లాగిన్ నుంచే సర్వే ఎండార్స్మెంట్ జనరేట్ అవుతుంది. గ్రామ సర్వేయర్లు నిర్వహించే సర్వేపై మండల సర్వేయర్లు మొదటి అప్పిలేట్ అధికారులుగా వ్యవహరిస్తారు. ఎఫ్ లైన్ పిటిషన్‌తో నిర్వహించే సర్వే సమయాన్ని కూడా 30 రోజుల నుంచి 15 రోజులకు తగ్గించారు. ప్రజల చెంతకే.. భూముల సర్వే సేవలు ప్రజలకు చేరువకావడం ఇదే ప్రథమం. ఇప్పటివరకు మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో ఉండే మండల సర్వేయర్ల వద్దకు భూయజమానులు వెళ్లాల్సి ఉండేది. ఇకనుంచి తమ గ్రామంలోని సచివాలయంలో పనిచేసే సర్వేయర్లే ఈ పని చేయనున్నారు. దీనిద్వారా సర్వేలో జాప్యం తగ్గడంతోపాటు భూయజమానులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగే పని తప్పుతుంది. భూముల రీ సర్వే సందర్భంగా వచ్చే ఎఫ్ లైన్ పిటిషన్లపైనా ప్రత్యేకదృష్టి పెట్టనున్నారు. ఈ పిటిషన్లను ఇష్టానుసారం తిరస్కరించకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తిరస్కరించిన దరఖాస్తుల్ని డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే అధికారుల స్థాయిలో పూర్తిగా పరిశీలించాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సాయిప్రసాద్ ఆదేశాలిచ్చారు. -
సర్వే బాధ్యతలు గ్రామ సర్వేయర్లకు..
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సర్వేయర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. భూముల సర్వే సహా ఇతర ముఖ్యమైన మండల సర్వేయర్ల బాధ్యతలను వీరికి బదలాయించింది. సర్వేను వేగంగా నిర్వహించి దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మండల సర్వేయర్లు మండలానికి ఒక్కరే ఉండడంతో సర్వే వ్యవహారాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. సర్వే కోసం భూయజమానులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది. దీనిపై ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులొస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్వే పనులు వేగంగా పూర్తి చేసేందుకు మండల సర్వేయర్ల బాధ్యతలను గ్రామ, వార్డు సర్వేయర్లకు అప్పగించింది. 1983 తర్వాత.. గ్రామ స్థాయికి సర్వే సర్వీసు ప్రధానంగా రికార్డుల ప్రకారం భూముల సరిహద్దుల్ని నిర్ధారించే ఎఫ్.లైన్ సర్వీసును గ్రామ సర్వేయర్లకు బదలాయించారు. ఎఫ్ఎంబీ (ఫీల్డ్ మెజర్మెంట్ బుక్), ఎల్పీఎం (ల్యాండ్ పార్సిల్ మ్యాప్), పీపీఎం (ప్రోపర్టీ పార్సిల్ మ్యాప్) ప్రకారం భౌతికంగా క్షేత్రస్థాయిలో హద్దుల్ని తెలిపేదాన్ని ఎఫ్ లైన్ సర్వీసుగా చెబుతారు. ఎవరైనా తమ భూములు, స్థలాల్ని విక్రయించినప్పుడు, భూమి హద్దుల్ని తనిఖీ చేసుకోవాలనుకున్నప్పుడు సర్వే కోసం రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకుంటారు. 1983కి ముందు సర్వే శాఖలో కింది స్థాయిలో ఉన్న తాలూకా సర్వేయర్ ఈ పని చేసేవారు. ఆ తర్వాత మండల వ్యవస్థ రావడంతో మండల సర్వేయర్లు ఆ బాధ్యత నిర్వహిస్తున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనను గ్రామ స్థాయికి తీసుకువచ్చి గ్రామ, వార్డు సచివాలయాలు నెలకొల్పారు. సచివాలయాల్లో ప్రత్యేకంగా 11 వేల మంది సర్వేయర్లను ప్రభుత్వం నియమించింది. ఇప్పుడు మండల సర్వేయర్ల బాధ్యతల్ని వాళ్లకి అప్పగించి సర్వే సర్వీసుల్ని ప్రజలకు మరింత దగ్గరకు చేర్చింది. ఇందుకనుగుణంగా సర్వే ప్రక్రియలో మార్పులు చేసింది. 15 రోజుల్లో సర్వే దరఖాస్తును పరిష్కరించాలని నిర్దేశించింది. గ్రామ సర్వేయర్ సర్వే నిర్వహించాల్సిన విధానం, అభ్యంతరాల పరిశీలన, దరఖాస్తును తిరస్కరిస్తే ఏ కారణాలతో తిరస్కరించాలో మార్గదర్శకాలు ఇచ్చింది. సాధారణంగా నిర్వహించే భూముల రికార్డుల నిర్వహణను కూడా వారికే అప్పగించింది. (క్లిక్: సంక్షేమాభివృద్ధి పథకాలు ఆపేయాలట!) 27 రోజుల్లో సబ్ డివిజన్ పూర్తి చేయాలి భూముల సబ్ డివిజన్ బాధ్యతను కూడా మండల సర్వేయర్ నుంచి గ్రామ సర్వేయర్లకు బదలాయించింది. భూముల రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యుటేషన్, సబ్ డివిజన్ చేసుకోవాలని ఇటీవల ప్రభుత్వం నిర్దేశించింది. ఈ క్రమంలో సబ్ డివిజన్ కేసుల్ని వేగంగా పూర్తి చేసేందుకు ఆ బాధ్యతలు గ్రామ సర్వేయర్లకు అప్పగించింది. స్క్రుటినీ బాధ్యతల్ని మాత్రం మండల సర్వేయర్లు చేస్తారు. 27 రోజుల్లో సర్వే సబ్ డివిజన్ పూర్తి చేయాలని నిర్దేశించింది. సర్వే దరఖాస్తుల తిరస్కరణ ఆర్డీవో, సబ్ కలెక్టర్ స్థాయిలోనే చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి రెండు వేర్వేరు సర్క్యులర్లను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భూపరిపాలనా ప్రధాన కమిషనర్ సాయి ప్రసాద్ విడుదల చేశారు. (క్లిక్: ఏపీలో 4 వేల ‘ఈవీ’ చార్జింగ్ స్టేషన్లు) -
మాకు పేస్కేల్ అమలు చేయాలి
విజయవాడ: లైసెన్సుడ్ సర్వేయర్లను అసిస్టెంట్ సర్వేయర్లుగా నియమించాలని సర్వేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య ప్రభుత్వాన్ని కోరారు. 2004లో అప్పటి సీఎం వైఎస్ఆర్ రాష్ట్రంలో సర్వేయర్ల కొరత తీర్చుటకు లైసెన్స్ సర్వేయర్ల వ్యవస్థ తెచ్చారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం మమ్ములను అసిస్టెంట్ సర్వేయర్ల పేరుతో జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్ ప్రకటించి అమలు చేయలేదన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ పాదయాత్రలో మా సమస్యలు విని సానుకూలంగా స్పందించారని ఇప్పుడు ముఖ్యమంత్రిగా గెలిచినందున వెంటనే మాకు పేస్కేల్ అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు -
ఆదిలాబాద్:కొలిచే వారేరి?
సాక్షి, ఇచ్చోడ(బోథ్): ఇద్దరు రైతుల మధ్య భూ తగాదా ఏర్పడినప్పుడు ఆ భూమిని కొలిచి సమస్యను పరిష్కరించాలి. కానీ జిల్లాలో సర్వేయర్ల కొరతతో ఎక్కడి భూ సమస్యలు అక్కడే ఉంటున్నాయి. వందలాది కేసులు పెండింగ్‌లో పడిపోతున్నాయి. అత్యవసరంగా భూములు కొలవాల్సి వచ్చినప్పుడు సర్వేయర్ల కోసం రోజుల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. ఏటా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు భూ సమస్యలపై అధికంగా దరఖాస్తులు వస్తుంటాయి. భూ వివాదాల కోసం దరఖాస్తు చేసుకున్న భూముల్లో పంటలు ఉండటంతో ఎక్కువగా ఫిబ్రవరి నుంచి జూన్ మధ్యలోనే సర్వేయర్లు భూములను కొలిచి హద్దులు నిర్ణయిస్తారు. కానీ జిల్లాలో సర్వేయర్ల కొరత ఉండటంతో ఏళ్లుగా భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. వేధిస్తున్న ఖాళీలు.. జిల్లాలో 18 మండలాల్లో 18 మంది సర్వేయర్లు ఉండాలి. కానీ కేవలం 8 మంది సర్వేయర్లు మాత్రమే పనిచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత నాలుగైదు సంవత్సరాల నుంచి సర్వేయర్లు లేకపోవడంతో ఒక్కో సర్వేయర్‌కు రెండు మూడు మండలాలు ఇన్చార్జి ఇవ్వడంతో భూ సమస్యలు పరిష్కారానికినోచుకోవడం లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భూ సర్వేలో భూ వివాదాలపై జిల్లా వ్యాప్తంగా 2 వేలకుపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే సర్వేయర్లు అందుబాటులో లేక పనులు ముందుకు సాగడం లేదు. ఏళ్లుగా డిప్యూటేషన్లే.. జిల్లాలోని 8 మంది సర్వేయర్లలో కొంత మంది సంవత్సర కాలంగా డిప్యూటేషన్‌పై ప్రాజెక్టుల్లో భూసేకరణ కోసం పనిచేస్తున్నారు. జిల్లాలో నిర్మిస్తున్న కోరాట–చనాఖా, పిప్పల్‌కోటి ప్రాజెక్టుల భూ సేకరణ కోసం గత సంవత్సరం నుంచి 8 మంది సర్వేయర్లలో ముగ్గురు ఈ పనుల్లోనే ఉన్నారు. అంటే ప్రసుతం జిల్లాలో 8 మంది సర్వేయర్లలలో ఐదుగురు మాత్రమే మండలాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ సర్వేయర్లకు భలే గిరాకీ.. ప్రభుత్వ సర్వేయర్ల కొరత ఉండటంతో ప్రైవేట్ సర్వేయర్లకు భలే గిరాకీ ఉంది. అన్నదమ్ముల భూ పంపకాలు, ఇద్దరు రైతుల మధ్య భూతగదాలు, భూవిక్రయాలు జరిగినప్పుడు భూ లెక్కలు తేల్చడానికి సర్వేయర్లు అవసరం. ప్రభుత్వ సర్వేయర్ల కొరత ఉండటం, ఉన్న వారు కూడ అత్యవసరంగా రాకపోవడంతో పలువురు రైతులు ప్రైవేట్ సర్వేయర్లను ఆశ్రయించక తప్పడం లేదు. దీంతో ప్రైవేట్ సర్వేయర్లకు భలే గిరాకీ ఉంటోంది. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు అంటే.. వర్షాలు పడేంత వరకు ప్రైవేట్ సర్వేయర్లు భూ లెక్కల్లో చాలా బిజీగా ఉంటున్నారు. అత్యవసర సమయంలో ప్రైవేటు సర్వేయర్లకు అన్నంత ఇవ్వాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ప్రైవేట్ సర్వేయర్‌తో భూమి కొలిపించాం సర్కారు సర్వేయర్ కోసం కార్యాలయం చుట్టూ తిరిగినం. సంవత్సరం నుంచి ఆయన డిప్యూటేషన్‌లో ఉన్నాడని తెలిసింది. దీంతో అత్యవసరంగా మా భూమి కొలవాల్సి రావడంతో గత్యంతరం లేక ప్రైవేటు సర్వేయర్‌ను కొలిపించాం. – రాథోడ్ దినేశ్‌నాయక్, దాబా(కె), ఇచ్చోడ మండలం -
ఏసీబీకి చిక్కిన సర్వేయర్
విశాఖపట్నం, దేవరాపల్లి(మాడుగుల): దేవరాపల్లి మండల సర్వేయర్ ఎల్. శామ్యూల్ ఏసీబీకి చిక్కారు. భూమి సర్వే రిపోర్టు కోసం రైతు నుంచి రూ. మూడు వేలు లంచం తీసుకుంటుండగా తహసీల్దార్ కార్యాలయంలోనే ఏసీబీ అధికారులు బుధవారం మధ్యాహ్నం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కె. రామకృష్ణ ప్రసాద్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెదనందిపల్లికి చెందిన చిన్నకారు రైతు కొటాన రామునాయుడు తన తల్లిదండ్రులు దేముడు, మంగయ్యమ్మల నుంచి సంక్రమించిన రెండు ఎకరాల భూమిని తనతో పాటు తన సోదరుడు అప్పలనాయుడుకు ఎకరా చొప్పున పట్టాదారు పాసు పుస్తకం మంజూరు చేయాలని ఈ నెల 3న దరఖాస్తు చేసుకున్నారు. పది రోజుల తర్వాత మండల సర్వేయర్ భూమిలోకి వచ్చి సర్వే ప్రక్రియ పూర్తి చేశారు. అనంతరం ఈ నెల 17న సర్వేయర్ శామ్యూల్ బాధిత రైతు కొటాన రామునాయుడుకు ఫోన్ చేసి సర్వే రిపోర్ట్ పూర్తయిందని, తహసీల్దార్ సంతకం పెట్టడమే మిగిలిందని తెలిపారు. ఇందుకు రూ.6 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని రైతు ప్రాధేయపడ్డాడు. చివరకు రూ.మూడు వేలు ఇవ్వాలని, ఇంతకు పైసా తగ్గించేది లేదని తెగేసి చెప్పడంతో గత్యంతరం లేక రైతు విశాఖపట్నంలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు తమ సమక్షంలోనే బాధితునితో సర్వేయర్‌కు ఫోన్ చేయించి మాట్లాడించారు. అప్పుడూ లంచం ఇవ్వాల్సిందేనని దురుసుగా మాట్లాడటంతో ఫిర్యాదును ధ్రువీకరించుకున్న ఏసీబీ అధికారులు డీఎస్పీ కె.రామకృష్ణ ప్రసాద్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్లు ఎస్కే గఫూర్, గణేష్, రమణమూర్తి పథకం ప్రకారం దాడి చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో రూ.3వేలు సర్వేయర్ రైతు నుంచి తీసుకున్నారు. వెంటనే బైక్‌పై వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న ఏసీబీ అధికార్లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని నగదు స్వాధీనం చేసుకున్నారు. వెంటనే తహసీల్దార్ కార్యాలయంలోకి తీసుకెళ్లి విచారించి అతని వేలి ముద్రలను సేకరించారు. కేసు నమోదు చేసి గురువారం విశాఖపట్నంలోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని డీఎస్పీ కె. రామకృష్ణప్రసాద్ తెలిపారు. కాగా మండలంలో ఇటీవల సీఐడీ అధికారులు ఉద్యోగాల పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడిన ఘటనపై విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మండల సర్వేయర్‌ను దాడి చేసి పట్టుకోవడంతో అవినీతి అధికారులు హడలెత్తిపోయారు. -
భూ సర్వేయర్ల దందా
రఘునాధపాలెం, న్యూస్‌లైన్: ఇప్పటివరకూ మనం దళారులు, భూకబ్జాదారులు భూదందా సాగించడం చూశాం. ఇప్పుడు సరికొత్తగా.. రెవెన్యూ ఉద్యోగులే (భూ సర్వేయర్లు) భూదందా సాగిస్తున్నారు. అసైన్డ్ భూమి పట్టాదారులను అదిరించి, బెదిరించి అందినంత దండుకుంటున్నారు. కాదూ... కూడదంటూ ఎవరైనా ఎదురుతిరిగితే.. ‘మీ భూమి సర్వే హద్దులు నిర్ణయించేది మేమే. మేం చెప్పినట్టు వినకపోతే.. మీ భూమి హద్దులు మారతాయి. మీ చేతుల్లోని భూమి ప్రభుత్వానికి స్వాధీనమవుతుంది’ అంటూ, బహిరంగంగానే బెదిరిస్తున్నారు. ఎదంతా ఎక్కడో మూరుమూలన కాదు.. నగరంలోనూ, దాని చుట్టుపక్కల సాగుతున్న ఈ ‘నయా దందా’కు సంబంధించి ‘న్యూస్‌లైన్’ పరిశీలనలో అనేక దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. రఘునాధపాలెం మండలంలోని రఘునాధపాలెం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 21, 30లోని అసైన్డ్ భూములను అధికారులు 2009లో రైతుల నుంచి స్వాధీనపర్చుకున్నారు. సాగర్ కాల్వ కట్టలపై తొలగించిన గుడిసె వాసులకు ఈ భూమిలో ప్లాట్లు ఇవ్వాలని జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆ ప్రకారంగా ఈ భూమిని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారులు గడిచిన 15 రోజులుగా చదును చేసి ప్లాట్లుగా మారుస్తున్నారు. ఇక్కడే, భూ సర్వేయర్లు బేరసారాలకు, అవి ఫలించకపోతే దందాగిరీకి దిగుతున్నారు. ఈ భూముల పరిసరాల్లోని పట్టా భూముల రైతులకు సర్వేయర్లు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అసైన్డ్ భూమికి అటూఇటూ ఉన్న తమ భూముల్లోనూ హద్దు రాళ్లు పాతుతున్నారని కొందరు రైతులు లబోదిబోమంటున్నారు. అక్కడ ఎకరం భూమి ధర 50లక్షల నుంచి కోటి రూపాయల వరకు పలుకుతోంది. ఇదే అదనుగా, అందనికాడికి దండుకునేందుకు మార్గంగా ఎంచుకున్న సర్వేయర్లు.. ఉద్దేశపూర్వకంగానే ప్రయివేటు భూముల్లో రాళ్లు పాతుతున్నారు. ఇదేమంటూ ప్రశ్నించిన రైతులతో బేరసారాలకు దిగుతున్నారు. ‘మా వద్ద పక్కాగా కాగితాలున్నాయి. మీకు రూపాయి కూడా ఇవ్వం’ అంటూ, తెగేసి చెప్పిన రైతులపట్ల సర్వేయర్లు దందా సాగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్వేయర్ బాధిత రైతులకు, సర్వే అధికారులకు మధ్యవర్తిగా ఒక రెవెన్యూ అధికారిణి భర్త రాయబారం సాగిస్తున్నట్టుగా ప్రచారం జోరుగా సాగుతోంది. {పస్తుతం ప్లాట్లు చేస్తున్న అసైన్డ్ భూమిని ఆనుకుని ఉన్న ప్రాంతంలో ఒక రియల్ వ్యాపారి పట్టా భూమిని ప్లాట్లు గా చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. దీనికి ప్రధాన రోడ్డు వైపు ఉన్న అసైన్డ్ భూమిలో పేదలకు ప్లాట్లు చేసి ఇస్తే.. లక్షలు ధారపోసి కొన్న భూమికి విలువ పడిపోతుందని సదరు వ్యాపారి భీతిల్లుతున్నారు. అక్కడ ఉన్న అసైన్డ్ భూమిలో ప్లాట్లు చేయకుండా ఉండేందుకుగాను కొంద రు రెవెన్యూ అధికారులకు, సర్వేయర్లకు ఆ వ్యా పారి పెద్ద మొత్తంలో ముట్టచెప్పినట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఒకవైపు అసైన్డ్ భూమిని పోలీసులకు ప్రభుత్వం కేటాయించిందని, ఆ వివరాలు సక్రమంగా లేవనే పేరుతో కొత్త పంచాయతీ మొదలైంది. ఈ వ్యవహారాలతో మొత్తంగా రెవెన్యూ శాఖ అభాసుపాలవుతోందన్నది జనాభిప్రాయంగా ఉంది. పరిసర మండలాల్లో కూడా ఇదే దందా... నగరీకరణలో భాగంగా ఖమ్మం పరిసర ప్రాంతాలైన రఘునాధపాలెం, ఖమ్మం రూరల్, కొణిజర్ల, చింతకాని మండలాల సరిహద్దుల్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిని ఇప్పటికే పలువురు అక్రమించి అడ్డదారిని పట్టాలు చేయించుకున్నట్టు సమాచారం. గతంలో పనిచేసిన అధికారులు ఇష్టా రాజ్యంగా ఇనాం తదితర భూములకు పట్టాలు ఇవ్వడం.. ఇప్పటి అధికారులకు వరంగా మారింది. {పధానంగా ఖమ్మం అర్బన్ మండలంలో పనిచేసి బదిలీపై వెళ్ళిన ఓ అధికారి తన ఇష్టారాజ్యంగా వ్యవహరించి, అనుచరులకు ప్రభుత్వ భూమిని రాసిచ్చినట్టు ప్రచారం సాగుతోంది. దీనిపై సదరు అధికారిపై పలు ఆరోపణలతో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లింది. పాత నక్షా తీసుకొచ్చి ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి ఎక్కడెక్కడ ఉంది.. దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న భూమి ఎవ్వరి ఆధీనంలో ఉంది.. అనేది ఆరా తీసి పలువురు అధికారులు మామూళ్ళపర్వానికి తెర లేపినట్టు సమాచారం. ఈ సందర్భంలో నిజమైన భూ యజమానులను కూడా బెదిరించి పలువురు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు పలువురు ఉన్నతాధికారుల అండదండలు ఉండటంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని, పట్టా భూములపై కూడా నిబంధల పేరుతో... అధికారులు జులుం ప్రదర్శిస్తున్నారని పలువురు భూ యజమానులు ఆరోపిస్తున్నారు. రాసిస్తే చర్యలు తీసుకుంటా.. అంటున్నారు.. ఆర్డీఓ సంజీవరెడ్డి. దీని పై ఆయనను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా.. ‘అలాంటిదేమీ మా దృష్టికి రాలేదు. ఎవరైనా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపించి, వాస్తవాలని తేలితే చర్యలు తీసుకుం టా. అసైన్డ్, ప్రభుత్వ భూమి ఎక్కడ ఉన్నా కచ్చితంగా సర్వే చేసి స్వాధీనపర్చుకుంటాం. వాటిని ప్లాట్లు చేసి పేదలకు ఇస్తాం. సర్వే చేసే అధికారులపై మరో అధికారి పర్యవేక్షణ ఉంటుంది. సర్వేలో రాజీ పడేది లేదు’ అన్నారు.