సర్వేయర్ శామ్యూల్(ఎరుపు రంగు బనియన్‌తో ఉన్న వ్యక్తి)ను విచారిస్తున్న ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణ ప్రసాద్
విశాఖపట్నం, దేవరాపల్లి(మాడుగుల): దేవరాపల్లి మండల సర్వేయర్ ఎల్. శామ్యూల్ ఏసీబీకి చిక్కారు. భూమి సర్వే రిపోర్టు కోసం రైతు నుంచి రూ. మూడు వేలు లంచం తీసుకుంటుండగా తహసీల్దార్ కార్యాలయంలోనే ఏసీబీ అధికారులు బుధవారం మధ్యాహ్నం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కె. రామకృష్ణ ప్రసాద్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెదనందిపల్లికి చెందిన చిన్నకారు రైతు కొటాన రామునాయుడు తన తల్లిదండ్రులు దేముడు, మంగయ్యమ్మల నుంచి సంక్రమించిన రెండు ఎకరాల భూమిని తనతో పాటు తన సోదరుడు అప్పలనాయుడుకు ఎకరా చొప్పున పట్టాదారు పాసు పుస్తకం మంజూరు చేయాలని ఈ నెల 3న దరఖాస్తు చేసుకున్నారు. పది రోజుల తర్వాత మండల సర్వేయర్ భూమిలోకి వచ్చి సర్వే ప్రక్రియ పూర్తి చేశారు. అనంతరం ఈ నెల 17న సర్వేయర్ శామ్యూల్ బాధిత రైతు కొటాన రామునాయుడుకు ఫోన్ చేసి సర్వే రిపోర్ట్ పూర్తయిందని, తహసీల్దార్ సంతకం పెట్టడమే మిగిలిందని తెలిపారు.
ఇందుకు రూ.6 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని రైతు ప్రాధేయపడ్డాడు. చివరకు రూ.మూడు వేలు ఇవ్వాలని, ఇంతకు పైసా తగ్గించేది లేదని తెగేసి చెప్పడంతో గత్యంతరం లేక రైతు విశాఖపట్నంలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు తమ సమక్షంలోనే బాధితునితో సర్వేయర్‌కు ఫోన్ చేయించి మాట్లాడించారు. అప్పుడూ లంచం ఇవ్వాల్సిందేనని దురుసుగా మాట్లాడటంతో ఫిర్యాదును ధ్రువీకరించుకున్న ఏసీబీ అధికారులు డీఎస్పీ కె.రామకృష్ణ ప్రసాద్ నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్లు ఎస్‌కే గఫూర్, గణేష్, రమణమూర్తి పథకం ప్రకారం దాడి చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో రూ.3వేలు సర్వేయర్ రైతు నుంచి తీసుకున్నారు. వెంటనే బైక్‌పై వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న ఏసీబీ అధికార్లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని నగదు స్వాధీనం చేసుకున్నారు. వెంటనే తహసీల్దార్ కార్యాలయంలోకి తీసుకెళ్లి విచారించి అతని వేలి ముద్రలను సేకరించారు. కేసు నమోదు చేసి గురువారం విశాఖపట్నంలోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని డీఎస్పీ కె. రామకృష్ణప్రసాద్ తెలిపారు. కాగా మండలంలో ఇటీవల సీఐడీ అధికారులు ఉద్యోగాల పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడిన ఘటనపై విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మండల సర్వేయర్‌ను దాడి చేసి పట్టుకోవడంతో అవినీతి అధికారులు హడలెత్తిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment