భూ సర్వేయర్ల దందా | Land squatters trying for assigned lands occupy | Sakshi
Sakshi News home page

భూ సర్వేయర్ల దందా

Published Fri, Feb 28 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 4:10 AM

Land squatters trying for assigned lands occupy

రఘునాధపాలెం, న్యూస్‌లైన్: ఇప్పటివరకూ మనం దళారులు, భూకబ్జాదారులు భూదందా సాగించడం చూశాం. ఇప్పుడు సరికొత్తగా.. రెవెన్యూ ఉద్యోగులే (భూ సర్వేయర్లు) భూదందా సాగిస్తున్నారు. అసైన్డ్ భూమి పట్టాదారులను అదిరించి, బెదిరించి అందినంత దండుకుంటున్నారు. కాదూ... కూడదంటూ ఎవరైనా ఎదురుతిరిగితే.. ‘మీ భూమి సర్వే హద్దులు నిర్ణయించేది మేమే. మేం చెప్పినట్టు వినకపోతే.. మీ భూమి హద్దులు మారతాయి. మీ చేతుల్లోని భూమి ప్రభుత్వానికి స్వాధీనమవుతుంది’ అంటూ, బహిరంగంగానే బెదిరిస్తున్నారు. ఎదంతా ఎక్కడో మూరుమూలన కాదు.. నగరంలోనూ, దాని చుట్టుపక్కల సాగుతున్న ఈ ‘నయా దందా’కు సంబంధించి ‘న్యూస్‌లైన్’ పరిశీలనలో అనేక దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూస్తున్నాయి.

     రఘునాధపాలెం మండలంలోని రఘునాధపాలెం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 21, 30లోని అసైన్డ్ భూములను అధికారులు 2009లో రైతుల నుంచి స్వాధీనపర్చుకున్నారు. సాగర్ కాల్వ కట్టలపై తొలగించిన గుడిసె వాసులకు ఈ భూమిలో ప్లాట్లు ఇవ్వాలని జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆ ప్రకారంగా ఈ భూమిని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారులు గడిచిన 15 రోజులుగా చదును చేసి ప్లాట్లుగా మారుస్తున్నారు. ఇక్కడే, భూ సర్వేయర్లు బేరసారాలకు, అవి ఫలించకపోతే దందాగిరీకి దిగుతున్నారు.

     ఈ భూముల పరిసరాల్లోని పట్టా భూముల రైతులకు సర్వేయర్లు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అసైన్డ్ భూమికి అటూఇటూ ఉన్న తమ భూముల్లోనూ హద్దు రాళ్లు పాతుతున్నారని కొందరు రైతులు లబోదిబోమంటున్నారు. అక్కడ ఎకరం భూమి ధర 50లక్షల నుంచి కోటి రూపాయల వరకు పలుకుతోంది. ఇదే అదనుగా, అందనికాడికి దండుకునేందుకు మార్గంగా ఎంచుకున్న సర్వేయర్లు.. ఉద్దేశపూర్వకంగానే ప్రయివేటు భూముల్లో రాళ్లు పాతుతున్నారు. ఇదేమంటూ ప్రశ్నించిన రైతులతో బేరసారాలకు దిగుతున్నారు. ‘మా వద్ద పక్కాగా కాగితాలున్నాయి. మీకు రూపాయి కూడా ఇవ్వం’ అంటూ, తెగేసి చెప్పిన రైతులపట్ల సర్వేయర్లు దందా సాగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

     సర్వేయర్ బాధిత రైతులకు, సర్వే అధికారులకు మధ్యవర్తిగా ఒక రెవెన్యూ అధికారిణి భర్త రాయబారం సాగిస్తున్నట్టుగా ప్రచారం జోరుగా సాగుతోంది.

 {పస్తుతం ప్లాట్లు చేస్తున్న అసైన్డ్ భూమిని ఆనుకుని ఉన్న ప్రాంతంలో ఒక రియల్ వ్యాపారి  పట్టా భూమిని ప్లాట్లు గా చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. దీనికి ప్రధాన రోడ్డు వైపు  ఉన్న అసైన్డ్ భూమిలో పేదలకు ప్లాట్లు చేసి ఇస్తే.. లక్షలు ధారపోసి కొన్న భూమికి విలువ పడిపోతుందని సదరు వ్యాపారి భీతిల్లుతున్నారు. అక్కడ ఉన్న అసైన్డ్ భూమిలో ప్లాట్లు  చేయకుండా ఉండేందుకుగాను కొంద రు రెవెన్యూ అధికారులకు, సర్వేయర్లకు ఆ వ్యా పారి  పెద్ద మొత్తంలో ముట్టచెప్పినట్టు ప్రచారం సాగుతోంది.

 ఇప్పటికే ఒకవైపు అసైన్డ్ భూమిని పోలీసులకు ప్రభుత్వం కేటాయించిందని, ఆ వివరాలు సక్రమంగా లేవనే పేరుతో కొత్త పంచాయతీ మొదలైంది. ఈ వ్యవహారాలతో మొత్తంగా రెవెన్యూ శాఖ అభాసుపాలవుతోందన్నది జనాభిప్రాయంగా ఉంది.

 పరిసర మండలాల్లో కూడా ఇదే దందా...
 నగరీకరణలో భాగంగా ఖమ్మం పరిసర ప్రాంతాలైన రఘునాధపాలెం, ఖమ్మం రూరల్, కొణిజర్ల, చింతకాని మండలాల సరిహద్దుల్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిని ఇప్పటికే పలువురు అక్రమించి అడ్డదారిని పట్టాలు చేయించుకున్నట్టు సమాచారం. గతంలో పనిచేసిన అధికారులు ఇష్టా రాజ్యంగా ఇనాం తదితర భూములకు  పట్టాలు ఇవ్వడం.. ఇప్పటి అధికారులకు వరంగా మారింది.

 {పధానంగా ఖమ్మం అర్బన్ మండలంలో పనిచేసి బదిలీపై వెళ్ళిన ఓ అధికారి తన ఇష్టారాజ్యంగా వ్యవహరించి, అనుచరులకు ప్రభుత్వ భూమిని రాసిచ్చినట్టు ప్రచారం సాగుతోంది. దీనిపై సదరు అధికారిపై పలు ఆరోపణలతో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లింది. పాత నక్షా తీసుకొచ్చి ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి ఎక్కడెక్కడ ఉంది.. దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న భూమి ఎవ్వరి ఆధీనంలో ఉంది.. అనేది ఆరా తీసి పలువురు అధికారులు మామూళ్ళపర్వానికి తెర లేపినట్టు సమాచారం.
     ఈ సందర్భంలో నిజమైన భూ యజమానులను కూడా బెదిరించి పలువురు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు పలువురు ఉన్నతాధికారుల అండదండలు ఉండటంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని, పట్టా భూములపై కూడా నిబంధల పేరుతో... అధికారులు జులుం ప్రదర్శిస్తున్నారని పలువురు భూ యజమానులు ఆరోపిస్తున్నారు.

 రాసిస్తే చర్యలు తీసుకుంటా..
 అంటున్నారు.. ఆర్డీఓ సంజీవరెడ్డి. దీని పై ఆయనను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా.. ‘అలాంటిదేమీ మా దృష్టికి రాలేదు. ఎవరైనా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపించి, వాస్తవాలని తేలితే చర్యలు తీసుకుం టా. అసైన్డ్, ప్రభుత్వ  భూమి ఎక్కడ ఉన్నా కచ్చితంగా సర్వే చేసి స్వాధీనపర్చుకుంటాం. వాటిని ప్లాట్లు చేసి పేదలకు ఇస్తాం. సర్వే చేసే అధికారులపై మరో అధికారి పర్యవేక్షణ ఉంటుంది. సర్వేలో రాజీ పడేది లేదు’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement