ప్రభుత్వ హామీల నుంచి దృష్టి మరల్చేందుకే అసైన్డ్ భూములపై కట్టుకథలు
చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు ఎల్లో మీడియా ఊతం
అమరావతి పేరుతో అక్రమాలకు పాల్పడింది టీడీపీ పెద్దలే
వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మండిపాటు
సాక్షి, అమరావతి: పేదలకు సంబంధించిన అసైన్డు భూముల విషయంలో ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే అసైన్డ్ భూములపై కట్టుకథలు అల్లుతున్నారని ధ్వజమెత్తారు. పేదల కోసం తెచ్చిన చట్టాన్ని కూడా తప్పుదారి పట్టించేలా వార్తలు రాశారని ఈనాడుపై ఆయన మండిపడ్డారు.
చంద్రబాబు భజనే తప్ప పేదల బాగోగులు ఎల్లో మీడియాకు పట్టవా? అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తిగా గతి తప్పిన ఈనాడు రోజూ రోత రాతలు రాస్తోందని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోక పోయినా చంద్రబాబు పల్లకి మోయడమే ఈనాడు లక్ష్యం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీడియా బాధ్యతను పూర్తిగా వదిలేసిన ఈనాడు.. చంద్రబాబు ఒక్కరే బాగుంటే చాలన్నట్లు వ్యవహరిస్తోందన్నారు. గత ప్రభుత్వ కార్యక్రమాలను ఎలా రద్దు చేయాలి.. లబ్ధిదారుల సంఖ్యను ఎలా తగ్గించాలి.. అనే విషయాలపైనే ప్రభుత్వ పెద్దలు దృష్టి పెట్టారని, దీనికి ఎల్లో మీడియా.. ముఖ్యంగా ఈనాడు వంత పాడుతోందని చెప్పారు. అనిల్ కుమార్ ఇంకా ఏమన్నారంటే..
అసైన్డ్ భూముల సమస్య ఎప్పటిది?
» అసైన్డ్ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడింది ఎవరు? చంద్రబాబునాయుడి ప్రభుత్వం కాదా? పేదల భూములను వారు కొట్టేయ లేదా? రాజధాని పేరు చెప్పి అమరావతిలో ఇదివరకు టీడీపీ ప్రభుత్వం చేసింది దోపిడీ కాదా? ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను మభ్యపెట్టి, మోసం చేసి 1100 ఎకరాలు కొట్టేశారు.
మీ చేతిలో భూములు ఉంటే, పరిహారం రాదని, ప్లాట్లు రావని చెప్పి.. పేదల భూములు లాగేసుకుని, ఆ తర్వాత జీవో ఇచ్చి, చేతులు మారిన భూములను పూలింగ్‌లోకి తీసుకున్నారు. ఆ తర్వాత బినామీలకు ప్లాట్లు కేటాయించి రూ.కోట్లు కొల్లగొట్టారు. అమరావతి ప్రాంతంలో దాదాపు 1336 మంది బినామీలు ఉన్నారు. దీనిపై కేసు నడుస్తోంది. ఇవన్నీ వాస్తవాలు కావా?
» నిజానికి అసైన్డ్ భూముల సమస్య ఈనాటిది కాదు. భూమి ఉన్నా కష్టం వస్తే, దాన్ని
ఏదో ఒకటి చేసుకుందామనుకున్నా, చేసుకోలేని పరిస్థితి ఉండేది. చివరకు పైసాకో, పరక్కో ఏదో ఒక కాగితం మీద రాసిచ్చి ఎంతో కొంత తీసుకుని భూములను అప్పగించే పరిస్థితి ఉండేది. 70 ఏళ్లుగా ఆ సమస్య కొనసాగింది.పేదలకు న్యాయం చేయడం కోసమే..
» పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూముల చట్టానికి సవరణలు చేశారు. దానికి సంబంధించి గత ఏడాది అక్టోబరు 27న గెజిట్ జారీ అయింది. ఆ మేరకు ఒరిజనల్ అస్సైనీలు, ఒకవేళ వారు లేకపోతే వారి చట్టబద్ధ వారసులను గుర్తించి, ఆ భూములపై హక్కులు కల్పించారు.
» జగన్ ప్రభుత్వం ఆనాడు ఏ స్వార్థం లేకుండా నిరుపేదలకు న్యాయం జరగాలన్న ఆలోచనతో మంచి చట్టాన్ని రూపొందించింది. అయితే ఎల్లో మీడియా.. ముఖ్యంగా ఈనాడు కుటిలమైన ఆలోచనతో దుష్ప్రచారం చేస్తోంది.ప్రజలు, రైతులు.. ముఖ్యంగా నిరుపేదలకు మంచి జరగకూడదు... వారి పొట్ట కొట్టాలి.. వారిని రోడ్డు మీదకు ఈడ్చాలనే లక్ష్యంతో తప్పుడు రాతలు రాస్తోంది.
» రైతుల సమస్యలు పరిష్కరించేలా గత సీఎం జగన్ చొరవ తీసుకున్నారు. షరతులతో కూడిన పట్టాలకు సంబంధించి 22 వేల మంది రైతులకు మేలు చేస్తూ 35 వేల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించారు. చుక్కల భూములను కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించారు. అటవీ భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు ఏకంగా 2,00,083 ఎకరాలకు సంబంధించి హక్కు పత్రాలు జారీ చేశారు. 15,21,160 మంది భూమి లేని నిరుపేదలకు, వారికి సంబంధించిన 27,41,698 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పించారు. ఆ భూములన్నీ 1954 తర్వాత అసైన్మెంట్ చేసినవే.
Comments
Please login to add a commentAdd a comment