ఖతర్ కీలక చట్టం: విదేశీయులకు గుడ్‌న్యూస్
సౌదీ నేతృత్వంలోని అరబ్ దేశాల నిషేధంతో తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిన ఖతర్, విదేశీయులకు గుడ్ న్యూస్ అందించింది. ఓ ల్యాండ్‌మార్కు బిల్లును ఖతర్ ఆమోదించింది. ఆ కీలక చట్టంతో ఖతర్‌కు వెళ్లే విదేశీయులకు శాశ్వత నివాస కార్డులు, కొత్త హక్కులు లభించనున్నాయి. ప్రస్తుతం ఖతర్ జనాభాలో విదేశీయులే ఎక్కువ. గల్ఫ్ ప్రాంతంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి దేశం ఇదే కావడం విశేషం. విదేశీయులు ప్రభుత్వ సర్వీసులు పొందడానికి ఈ చట్టం ఎంతో దోహదం చేస్తోంది. ఈ కొత్త చట్టం కింద కార్డుహోల్డర్స్ ఖతర్ జాతీయులగానే పరిగణించబడతారు. అంతేకాక అక్కడి రాష్ట్రాలు అందించే విద్యా, ఆరోగ్య పరమైన సర్వీసుల విషయంలో అన్ని ప్రయోజనాలను విదేశీయులు పొందుతారని ఖతర్ న్యూస్ ఏజెన్సీకి అధికారులు తెలిపారు. మిలటరీ, ప్రజా సంబంధమైన ఉద్యోగాల విషయంలో స్థానికుల తర్వాత వీరికి ప్రాధాన్యత ఇస్తామని అధికారులు చెప్పారు.
స్థానిక భాగస్వామి అవసరం లేకుండా వాణిజ్యపరమైన కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చని, సొంత ఆస్తులను కలిగి ఉండొచ్చని ఖతర్ న్యూస్ ఏజెన్సీ(క్యూఎన్ఏ) రిపోర్టు చేసింది. విదేశీయులను పెళ్లి చేసుకున్న ఖతారి మహిళల పిల్లలకు, రాష్ట్రాలకు అవసరమైన ప్రత్యేకమైన ప్రతిభ కలిగిన ప్రజలకు, దేశాలనికి చెప్పుకోదగ్గ సేవలు అందించిన వారు ఈ కార్డులకు అర్హులవుతారని క్యూఎన్ఏ తెలిపింది. ఈ కొత్త చట్టం ఖతార్ ప్రధాన వార్తలలో నిలుపుతుందని, ఇతరులతో పోలిస్తే, మరింత ముందస్తుగా ఆలోచించే దేశంగా పేరొందుతుందని మధ్యప్రాచ్య, ఉత్తరాఫ్రికా అనాలిస్టు అలిసన్ వుడ్ చెప్పారు. ఇలాంటి రెసిడెన్స్ ప్రొగ్రామ్స్ ఇక ఎలాంటి దేశాల్లో లేవన్నారు. ఆయిల్ ధరలు తగ్గడంతో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఉన్న ఆరు గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒత్తిడిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సౌదీ అరేబియా, ఒమెన్ మినహా మిగతా నాలుగు దేశాల్లో స్థానిక జనాభా కంటే కూడా విదేశీ వర్కర్లు, వారి కుటుంబసభ్యులే ఎక్కువ.