కనుల పండువగా లంకాదహనం
గుంతకల్లు రూరల్ : ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో మూడు రోజులుగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న ఉగాది ఉత్సవాలు శుక్రవారం నాటి లంకాదహనం కార్యక్రమంతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు లంకాదహనం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం ప్రత్యేక పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన నెట్టికంటి ఆంజనేయస్వామి ఉత్సవమూర్తిని ఒంటెవాహనంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఈఓ ఆనంద్‌కుమార్, ధర్మకర్త సుగుణమ్మ, ఇతర పాలకమండలి సభ్యుల చేతులు మీదుగా స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం ఆలయ వేద పండితులు రామకృష్ణావధాని, అనంత పద్మనాభశర్మ ఆధ్వర్యంలో ముఖ్య అర్చకులు రాఘవచార్యులు, అనంతాచార్యులు, ఇతర అర్చక బృందం ఆధ్వర్యంలో ఉత్సవమూర్తికి విశేష అర్చన, వేద గోష్ఠి పూజలు నిర్వహించారు. అనంతరం నెట్టికంటి ఆంజనేయస్వామి చేతులమీదుగా లంకాదహనం కార్యక్రమం ప్రారంభించారు. సుమారు రెండు గంటలపాటు జరిగిన లంకాదహనం వేడుకలను వీక్షించేందుకు గ్రామస్తులు, భక్తులు వేలాదిగా తరలివచ్చారు. కార్యక్రమంలో ఆలయ అధికారులతో పాటు గుంతకల్లు జేఎçఫ్సీఎం జడ్జి కె.వాసుదేవరావు, వైఎస్సార్సీపీ సర్పంచ్ తిక్కస్వామి, కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి సోమిరెడ్డి, బెస్త మనోహర్, శ్రీరాములు పాల్గొన్నారు.