కనిపించని జలకళ
సాక్షి, ఖమ్మం : ఈ సీజన్లో జల కళతో ఉండాల్సిన సాగు నీటి రిజర్వాయర్లు, పెద్ద చెరువులు వర్షాభావంతో వట్టికుండలా మారుతున్నాయి. పచ్చని పైర్లతో కళకళలాడాల్సిన ఆయకట్టు భూములు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. వర్షం లేకపోవ డంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న రిజర్వాయర్లు, పెద్ద చెరువుల్లో రోజురోజుకూ నీటి మట్టం తగ్గిపోతోంది. దీంతో 87,850 ఎకరాల ఆయకట్టు సాగుకు నోచుకోలేదు. చిన్న, మధ్య తరహా చెరువుల్లో నీరు లేకపోవడంతో 2 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది.
జిల్లాలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలో పాలేరు, వైరా రిజర్వాయర్లు, లంకాసాగర్ ప్రాజెక్టు, 200 పైగా చిన్న, మధ్య తరహా చెరువులు ఉన్నాయి. కాలువ నీటితో వీటిని నింపాల్సి ఉంటుంది. అయితే సాగర్‌లో నీరు లేక ప్రధాన రిజర్వాయర్లలో నీటి సామర్థ్యం తగ్గింది. మిగతా చిన్న చెరువులు కూడా చాలా వరకు ఎండిపోయాయి. ఇక వర్షాధారంగా నిండే కిన్నెరసాని రిజర్వాయర్‌లో కొంతమేర నీరుంది.
బేతుపల్లి, గుమ్మడవల్లి పెద్దవాగు, మూకమామిడి ప్రాజెక్టులు, బయ్యారం పెద్ద చెరువులో నీటి నిలువ గత ఏడాదితో పోలిస్తే చాలా వరకు తగ్గింది. జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులు, రిజర్వాయర్ల పరిధిలో మొత్తం 87,850 ఎకరాల ఆయకట్టు, నాగార్జునసాగర్ కాలువ పరిధిలో ఉండే చెరువులు, వర్షాధారంగా నిండే రిజర్వాయర్ల పరిధిలో సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే ప్రస్తుతం వీటిలో నీరు లేక ఆ భూములన్నీ బీళ్లుగానే మారాయి. పాలేరు, వైరా, కిన్నెరసానిలో ఉన్న నీటిని ప్రస్తుతం తాగునీటి అవసరాలకే విడుదల చేస్తున్నారు. సాగునీటికి సరిపడేంత నీరు ఈ రిజర్వాయర్లలో లేకపోవడంతో ఏ పంటలు సాగు చేయాలో తెలియక ఆయకట్టు రైతులు అయోమయంలో ఉన్నారు.
సాగర్ వస్తేనే పాలేరు, వైరా నిండేది..
నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండితేనే జిల్లాలోని పాలేరు, వైరా, లంకాసాగర్ రిజర్వాయర్ల పరిధిలో సాగు నీటికి నీరు విడుదల కానుంది. అప్పటి వరకు రైతులు సాగు కోసం ఎదురు చూడాల్సిందే. ఇక్కడ బోరుబావుల కింద వరినార్లు పోసినా నాట్లకు మాత్రం సాగర్ నీరు రావాల్సిందే. పాలేరు రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 23 అడుగులు కాగా ప్రస్తుతం 14 అడుగుల నీరు మాత్రమే ఉంది. దీని కింద కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో 20 వేల ఎకరాల ఆయకట్టు సాగు కావాలి.
ఇక్కడ ప్రధానంగా వరి, చెరుకు పంటలు సాగు చేస్తారు. అయితే వర్షాభావంతో కనీసం రిజర్వాయర్‌లోకి పై నుంచి వరద నీరు కూడా రాలేదు. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉన్న నీటిని ఖమ్మం నగరానికి తాగునీటి కోసం ఉపయోగిస్తున్నారు. వైరా రిజర్వాయర్ నీటి నిలువ 18.3 అడుగులు కాగా, ప్రస్తుతం 11.10 అడుగుల నీరుంది. ఈ రిజర్వాయర్ పరిధిలో 17,390 ఎకరాల ఆయకట్టు ఉంది. నీటి నిలువ తక్కువగా ఉండడంతో ఆయకట్టుకు కాకుండా వైరా, తల్లాడ, కొణిజర్ల, ఎర్రుపాలెం, మధిర, బోనకల్లు మండలాల్లోని గ్రామాలకు తాగునీటి అవసరాలకు విడుదల చేస్తున్నారు.
ఆయకట్టులో వరినార్లు పోసిన రైతులు నీటి కోసం ఎదురుచూస్తున్నారు. పెనుబల్లి మండలంలోని లంకాసాగర్ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 16 అడుగులు కాగా ప్రస్తుతం 5 అడుగుల నీరు మాత్రమే ఉంది. నీటి నిలువ డెడ్ స్టోరేజీకి చేరడంతో 8 వేల ఎకరాల ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఉన్న నీటిని పెనుబల్లి, వేంసూరు మండలాల్లోని 43 గ్రామాలకు తాగునీటి కోసం సరఫరా చేస్తున్నారు.
పరవళ్లు తొక్కని కిన్నెరసాని..
కిన్నెరసాని రిజర్వాయర్ పరిధిలో ఏటా ఈ సీజన్లో 10 వేల ఎకరాాలు సాగవుతుంది. కుడి కాలువ కింద మూడు వేలు, ఎడమ కాలువ కింద 7 వేల ఎకరాలు ఆయకట్టు ఉంది. రిజర్వాయర్ సామర్థ్యం 407 అడుగులు కాగా ప్రస్తుతం 382 అడుగుల నీరుంది. 400 అడుగుల నీరుంటేనే ఈ రెండు కాలువలకు విడుదల చేస్తారు. పై నుంచి వరద నీరు రాకపోవడంతో రిజర్వాయర్ నిండే పరిస్థితి లేదు. ఉన్న నీటిని కేటీపీఎస్, ఎన్ఎండీసీ, నవభారత్ పరిశ్రమలకు, పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలకు తాగునీరు విడుదల చేస్తున్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని బేతుపల్లి చెరువు నీటి సామర్థ్యం 16 అడుగులు.
కేవలం వర్షాధారంగా నిండే ఈ చెరువు ప్రస్తుత నీటి మట్టం 8 అడుగులు. దీంతో ఈ చెరువు పరిధిలో ఉన్న 6 వేల ఎకరాల ఆయకట్టుకు చుక్కనీరు విడుదల చేయలేదు. అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి గ్రామ సమీపంలోని పెదవాగు ప్రాజెక్టు ఆయకట్టు 16 వేల ఎకరాలు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 21 అడుగులు కాగా ప్రస్తుతం 14 అడుగులు మాత్రమే ఉంది. గతేడాది ఈ సమయానికి 2 సార్లు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు. నీళ్లు తక్కువగా ఉండడంతో ఈ ఖరీఫ్‌లో కనీసం వరినార్లు కూడా పోయలేదు.
బయ్యారం పెద్దచెరువు నిండేదెప్పుడు..?
గార్ల, బయ్యారం మండలాల్లోని సాగు భూములకు బయ్యారం పెద్దచెరువు నీరే ఆధారం. ఈ చెరువు అలుగు పోస్తేనే నీటిని కిందకు విడుదల చేస్తారు. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం16.3 అడుగులు కాగా ఇప్పుడు కేవలం 4.1 అడుగులు మాత్రమే ఉంది. గత ఏడాది ఇదే నెలలో చెరువు పూర్తిగా నిండి అలుగుపోసింది. చెరువులోకి నీరు వస్తే పంటలు వేసుకోవచ్చనే ఆశతో గార్ల, బయ్యారం మండలాల్లోని 7,200 ఎకరాల ఆయకట్టును రైతులు దున్ని సిద్ధం చేశారు. ముల్కలపల్లి మండలంలోని మూకమామిడి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 28 అడుగులు కాగా ప్రస్తుతం 2 అడుగుల మేర నీరుంది.
దీని ఆయకట్టు 3,260 ఎకరాలు. ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో వర్షాలు ఎప్పుడు పడతాయోనని రైతులు ఎదురుచూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలా రిజర్వాయర్లు, పెద్ద, చిన్న చెరువుల్లో నీళ్లు లేకపోవడంతో ఈ ఖరీఫ్ సాగు సందిగ్ధంలో పడింది.