యువతిని రైలు కిందకు తోసి హత్య
చేగుంట, మాటా మాటా పెరిగి ఆవేశంతో ఓ యువతిని రైలు కింద తోసి హత్యకు పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. ఈ సంఘటన మెదక్ జిల్లా చేగుంట పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీనివాసనగర్ రైల్వేస్టేషన్లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. మాసాయిపేటకు చెందిన మున్నీబీ, ఆమె కుమార్తె తస్లిం(23) మేడ్చల్‌లోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగే ఓ వివాహానికి హాజరయ్యేందుకు మున్నీబీ ముందుగానే వెళ్లిపోవడంతో తస్లిం శనివారం పరిశ్రమలో పని ముగించుకుని శ్రీనివాస్‌నగర్ రైల్వేస్టేషన్‌కు వచ్చింది.
తస్లిం పనిచేసే పరిశ్రమలోనే విధులు నిర్వర్తించే మేడ్చల్‌కు చెందిన నరేందర్ అక్కడ తారసపడ్డాడు. మాట్లాడుతుండగానే వీరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహించిన నరేందర్ అటువైపు వస్తున్న రైలు కిందికి తోసేశాడు. దాంతో తస్లిం అక్కడికక్కడే మృతి చెందింది. ఇది చూసిన ప్రయాణికులు నరేందర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. అయితే వారి గొడవకు కారణమేంటో తెలియలేదు.