మల్లేశ్వరస్వామి ఆలయంలో చోరీ
గుప్త నిధుల వేటగాళ్లే ఎత్తుకెళ్లారని అనుమానాలు
రంగంలోకి దిగిన క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్
పోలీసు అదుపులో ఇద్దరు నైట్వాచ్మెన్లు, మరో వ్యక్తి
మండల కేంద్రంలోని చోళరాజుల పాలనలో నిర్మించిన పురాతన ఆలయం శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయంలో ఉన్న ఒక చిన్న శివలింగాన్ని బుధవారం తెల్లవారుజామున దుండుగులు ఎత్తుకెళ్లారు. ఆలయ ఈఓ రామాంజినేయులు అందించిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి. ఆలయం లోపలికి ప్రవేశించగానే ముఖ మండంపం ఉంది. అందులో ఒక చిన్నపాటి శివలింగాన్ని ఏర్పాటు చేశారు. దీనికి కూడా పూజలు నిర్వహించే వారు. ఇందులో గుప్త నిధులు ఉంటాయన్న ఉద్దేశ్యంతో దుండుగులు ఆలయంలోకి ప్రవేశించి అక్కడే ఉన్న నైట్వాచ్మ్యాన్లు శివన్న, శ్రీహరిలను బెదిరించి శివలింగాన్ని ఎత్తుకెళ్లారు. ఫిర్యాదు అందుకున్న ఎస్ఐ నగేష్‌బాబు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి అక్కడ ఉన్న ఇద్దరు నైట్వాచ్మ్యాన్లను విచారించారు. అయితే వారు తాము రాత్రికి ఆలయం గేటు వేసుకుని పడుకుని ఉంటే ఇద్దరూ వ్యక్తులు 2 గంటల ప్రాంతంలో గోడదూకి ఆలయంలోకి ప్రవేశించారని ముఖానికి నల్ల బట్టలు కట్టుకుని ఉండడంతో వారిని గుర్తు పట్టలేదు. తమను కత్తులతో బెదిరించి మాపై మత్తు మందును చల్లడంతో తాము మత్తులోకి వెళ్లాము. అంతే ఏమి జరిగిందో ఉదయం దాకా తెలియదని అప్పటికే శివలింగం లేని విషయాన్ని ఈఓకు సమాచారం ఇచ్చామని చెప్పారు. అయితే వారు చెప్పే మాట్లాల్లో వాస్తవం కనిపించకపోవడంతో పోలీసులు వారిని ఆదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
గుప్త నిధుల కోసమే...
మల్లేశ్వరాలయంలో జరిగిన శివలింగం చోరీ గుప్త నిధుల కోసమేనని తెలుస్తోంది. గతంలో కమలం పువ్వును ధ్వంసం చేసి ఎత్తుకెళ్లారు. అలాగే రెండోసారి ఆలయంలోని గణపతి విగ్రహాన్ని, ఇప్పుడు శివలింగాన్ని ఎత్తుకెళ్లడంతో గుప్త నిధుల కోసమే చోరీలకు పాల్పడి ఉంటారని తెలుస్తోంది.
రంగంలోకి దిగిన క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్ : మల్లేశ్వరస్వామి ఆలయంలో జరిగిన శివలింగం చోరీ ఘటనపై పోలీస్ శాఖ ఛాలెంజ్‌గా తీసుకుంది. వెంటనే క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్ బృందాలు పోలీసు జాగిలాలతో రంగలోకి దించారు. వారు వచ్చి ఆలయ చుట్టుపక్కల తనిఖీలు చేశారు. ఎక్కడా క్లూ లభించలేదు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ : చోరీ జరిగినకంబదూరు మల్లేశ్వరస్వామి ఆలయాన్ని కళ్యాణదుర్గం డీఎస్పీ అనిల్‌కుమార్, సీఐ మన్సురుద్దీన్ పరిశీలించారు. ఈ ఘటనపై అక్కడి సిబ్బంది, ఆలయ అధికారులను విచారించారు. 24 గంటల్లో కేసును ఛేదిస్తామని చెప్పారు.