పేరంటాలమ్మ ఆలయం కిటకిట
రామవరప్పాడు :
కృష్ణా పుష్కరాలు ప్రారంభాన్ని పురస్కరించుకుని రామవరప్పాడులోని పేరంటాలమ్మ ఆలయం శుక్రవారం వేకువజాము నుంచి భక్తులతో కిక్కిరిసింది. గ్రామంతో పాటు చుట్టూ పక్కల గ్రామాల్లోని మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని శివాలయం, నవగ్రహ మండపాలను దర్శించి తీర్థప్రసాదాలను అందుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కుళాయిల వద్ద పవిత్ర జల్లు స్నానాలను ఆచరించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు కృష్ణమ్మకు ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు.
ఈనెల 23 నుంచి 25వ తేదీ వరకూ ఆలయ ప్రాంగణంలో భగవాన్ వెంకయ్యస్వామి ఆరాధన ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు దాసరి సాంబయ్య తెలిపారు. విఘ్నేశ్వరుడి పూజతో కార్యక్రమాలు ప్రారంభమై పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారని తెలిపారు. స్వామివారి అభిషేకం, అషో్టత్తరపూజ, హారతి ‘ఓం నారాయణ– ఆదినారాయణ ’ స్వామి వారి ఏకనామం జరుగుతుందని వివరించారు. 12 రోజుల పాటు జరిగే పుష్కరాల సందర్భంగా వెంకయ్య స్వామి ఆలయ ఆధ్వర్యంలో నిత్యం సుమారు 500 మంది భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
యాత్రికులకు అల్పాహారం
రామవరప్పాడు : గూడవల్లి సమీపంలోని పుష్కరనగర్ వద్ద చేసిన ఏర్పాట్లకు యాత్రికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి వస్తున్న యాత్రికుల నిమిత్తం ఈ పుష్కర నగర్‌ను ఏర్పాటు చేశారు. 24 గంటలకు మూడు షిప్టులుగా ఇక్కడి అధికారులు పనిచేస్తున్నారు. మరుగుదొడ్లు, పార్కింగ్ వసతులను ఏర్పాట్లు చేశారు. సుదార ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు ఇక్కడ వారి వారి వాహనాలు నిలుపుకుని ఉచిత బస్సుల్లో వారు కోరిన ఘాట్లకు తీసుకెళ్లె సౌకర్యం కల్పించారు. ప్రసాదంపాడు సాయి బాబు ఆలయం ఆధ్వర్యంలో యాత్రికులకు పెరుగన్నం, సాంబారన్నంను అల్ఫాహారంగా అందజేశారు. తాగునీటి వసతి కల్పించారు. తొలి రోజు కావడంతో యాత్రికుల సందడి అంతగా లేకున్నా శని, ఆదివారాల్లో యాత్రికుల రద్దీ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.