Lashkar E Taiba Militants
-
బారాముల్లా ఎన్కౌంటర్ : లష్కరే కీలక కమాండర్ హతం
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో ఓ లష్కరే తోయిబా కమాండర్ సహా ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. క్రీరి ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందుకున్న సీఆర్పీఎఫ్, జమ్ము కశ్మీర్ పోలీసులతో కూడిన సంయుక్త బృందం లష్కరే కమాండర్ సాజద్ అలియాస్ హైదర్ సహా మరో లష్కరే ఉగ్రవాదిని హతమార్చింది. అంతకుముందు ఉగ్రవాదుల దాడిలో పోలీస్ అధికారితో పాటు ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. సీఆర్పీఎఫ్ జవాన్లు తమ వాహనం నుంచి బయటికి దిగుతున్న సమయంలో ఈ దాడి జరిగిందని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. దాడి అనంతరం ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా సిబ్బంది సాజిద్ సహా ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టగా మరో ఉగ్రవాది తప్పించుకున్నాడు. ఉత్తర కశ్మీర్లో చురకుకుగా పనిచేసే ఉగ్రవాది సాజిద్‌ను హతమార్చామని, ఇక్కడ టాప్ 10 ఉగ్రవాదుల్లో సాజిద్ ఒకడని జమ్ము కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు. అనతుల్లా మిర్ అనే మరో ఉగ్రవాదిని మట్టుబెట్టామని చెప్పారు. బారాముల్లాలో తాజాగా జరిగిన కాల్పుల్లో ఇద్దరకు జవాన్లకూ గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. చదవండి : బారాముల్లా ఉగ్రదాడిలో ఇద్దరు జవాన్లు మృతి -
కాశ్మీర్ ఎన్కౌంటర్: ముగ్గురు మిలిటెంట్ల హతం
సాక్షి,శ్రీనగర్: ఈ ఏడాది అమర్నాథ్ యాత్రికులపై దాడికి బాధ్యులుగా భావిస్తున్న ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు మంగళవారం దక్షిణ కాశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించినట్టు పోలీసులు వెల్లడించారు. కాల్పుల ఘటన నుంచి తప్పించుకున్న మరో మిలిటెంట్‌ను అనంత్‌నాగ్ జిల్లాలోని ఓ మెటర్నిటీ ఆస్పత్రి నుంచి అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. జమ్మూ శ్రీనగర్ హైవేపై వెళుతున్న ఆర్మీ కాన్వాయ్‌పై కాజీగండ్ వద్ద మిలిటెంట్లు కాల్పులు జరపడంతో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఓ మిలిటెంట్ హతమయ్యాడు. ఈ క్రమంలో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని గాలింపు చర్యలు చేపట్టడంతో ఎన్కౌంటర్ చోటుచేసుకుందని పోలీసులు చెప్పారు. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకూ ఎన్కౌంటర్ కొనసాగినట్టు సమాచారం. మరణించిన మిలిటెంట్లను యావర్ బాసిర్, అబు ఫర్ఖన్, అబు మవియలుగా గుర్తించారు. -
ఇద్దరు మిలిటెంట్ల హతం
శ్రీనగర్: భద్రతా దళాలు, లష్కరే తోయిబా మిలిటెంట్లకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు మరణించారు. ఒక పోలీసు గాయపడ్డాడు. మిలిటెంట్లు చొరబడ్డారన్న సమాచారంతో సైనికులు, పోలీసులు సంయుక్తంగా సోమవారం రాత్రి దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో తనిఖీలు చేస్తుండగా ఇద్దరు మిలిటెంట్లు తారసపడడంతో ఇరు పక్షాల మధ్య కాల్పులు మొదలయ్యాయి. రాత్నిపుర, నారు గ్రామాల మధ్య వరిపొలాల్లో వీరిని మట్టుబెట్టినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు.. ఈ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా పుల్వామా జిల్లాలో మంగళవారం నిరసన ప్రదర్శన జరుపుతున్న ఆందోళనకారులపై భద్రతాబలగాలు జరిపిన కాల్పుల్లో 23 ఏళ్ల యువకుడు మరణించాడు. మృతుడిని పడ్గంపురా గ్రామానికి చెందిన బిలాల్ అహ్మద్ భట్‌గా గుర్తించారు.