అమ్మ రాసిన ఆఖరి ఉత్తరం
ముంబై: జైలు నుంచి విడుదలయ్యాక సంజయ్ దత్ తన కుటుంబసభ్యులతో గడుపుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల సంజయ్ తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. సంజయ్ జైలు నుంచి బయటకు రావడం ఆయన కూతురు త్రిషాలకు అమిత సంతోషాన్ని కలిగించింది. త్రిషాల తల్లిదండ్రులతో తన అనుబంధాన్ని ట్విటర్లో పంచుకుంది.
సంజయ్, ఆయన మొదటి భార్య రిచా శర్మ కూతురు త్రిషాల. రిచా కేన్సర్ వ్యాధితో 33 ఏళ్ల వయసులో మరణించింది. చిన్న వయసులోనే తల్లి దూరంకావడం, తండ్రి జైలుపాలు కావడం త్రిషాలను కలచివేసింది. రిచా శర్మ చనిపోయే ముందు రాసిన ఆఖరి ఉత్తరాన్ని త్రిషాల ట్విటర్లో పోస్ట్ చేసింది. 'అందరం కలసి జీవిస్తాం. ప్రతి ఒక్కరూ ఎవరిదారి వారు చూసుకుంటారు. నేను నా దారి చూసుకున్నా. అయితే నేనూ ఎటూ దారితోచని స్థితిలోకి వెళ్లిపోయా. వెనక్కు ఎలా రావాలో? మరో అవకాశం ఉంటుందా? వీటన్నంటికీ కాలమే సమాధానం చెబుతుంది. ఎంతకాలమైనా ఎదురు చూస్తా. వెనక్కు వచ్చే దారి లేదని నా మనసుకు తెలుసు. అయినా ఇప్పటికీ ఆశ ఉంది.
ఓ దైవధూతా నా కలలు ఎదురుచూస్తున్న ప్రదేశానికి నన్ను తీసుకువెళ్లు. ఎంతో జాగ్రత్తగా నాకు స్వాగతం పలుకుతారు' అని రిచా తన చివరి లేఖ రాసింది. తన తల్లి చనిపోయినపుడు ఈ ఉత్తరాన్ని చూశానని త్రిషాల నాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది. '21 సంవత్సరాల క్రితం ఈ ఉత్తరాన్ని చూశా. రైటింగ్ స్కిల్స్ ఎక్కడ నుంచి వచ్చాయో ఇప్పుడు తెలుస్తోంది. జీవితం చాలా చిన్నది. అమ్మను మిస్సయ్యా' అని త్రిషాల ట్వీట్ చేసింది. రిచా మరణాంతరం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న సంజయ్.. మాన్యతను రెండో వివాహం చేసుకున్నాడు.