ఏడాది తర్వాత సొంత గూటికి..
కోలారు (కర్ణాటక): ఏడాది క్రితం మతిస్థిమితం కోల్పోయిన ఓ మహిళ దేశంలోని పలు రాష్ట్రాలను చుట్టి సినిమా ఫక్కీలో సొంత ఇంటికి చేరింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా పెమ్మశెట్టిహళ్లి గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. వివరాలు.. పెమ్మశెట్టి గ్రామానికి చెందిన సురేష్ భార్య వేదవతి మానసిక రుగ్మతతో బాధపడుతుండగా భర్త సురేష్, సోదరుడు ముళబాగిలోని ఓ దర్గాలో చికిత్స చేయించడానికి తీసుకు వెళ్లారు. అదే రోజు రాత్రి వేదవతి తప్పించుకుపోయింది. నాటి నుంచి భర్త సురేష్ , సోదరుడు వేదవతి కోసం వెదకడం ప్రారంభించారు.
మతిస్థిమితం కోల్పోయిన ఆమె పలు రాష్ట్రాల్లో తిరిగి ఎలాగో సమీపంలోని సిర్సా వెళ్లే మార్గాన ఉన్న ఓ మోరి వద్ద ఏడుస్తూ కూర్చుంది. ఆ సమయంలో ఆమె ధీన పరిస్థితిని గమనించిన సిర్సాలోని బాయికణ్ణయ్య ఆశ్రమ నిర్వాహకుడు గురు దేవేందర్ అశ్రయమిచ్చాడు. దాదాపు నాలుగు నెలలు చికిత్స చేయించి మామూలు మనిషిని చేశారు. కోలుకున్న వేదవతి తన చిరునామాను వారికి తెలియజేసింది. సిర్సా జిల్లా ఎస్పీ అశ్విన్ శన్వి కన్నడిగుడే కావడంతో కోలారు రూరల్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. దాంతో రూరల్ పోలీసులు వేదవతి సోదరుడికి ఫోన్‌చేసి సిర్సాలోని ఆశ్రమంలో ఉన్నట్లు సమాచారం అందించారు. పోలీసుల సహకారంతో వెంటనే హర్యానాలోని సిర్సా జిల్లాకు చేరుకున్న వేదవతి సోదరుడు అక్కడి ఎస్పీ సహకారంతో తన వెంట తీసుకువచ్చారు.