వైఎస్ ఇక లేరని..
అచ్చంపేట/కొల్లాపూర్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాలమరణాన్ని తట్టుకోలేక అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో ముగ్గురు మృతిచెందారు. బాధిత కుటుంబాలను మంగళవారం షర్మిల పరామర్శించనున్నారు. అమ్రాబాద్‌కు చెందిన పర్వతనేని(బోగం) రంగయ్య వైఎస్ అభిమాని. 2009 సెప్టెంబర్8న వైఎస్ఆర్ సంతాపసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఆందోళనతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
లేపిచూసే సరికి అప్పటికే ప్రాణాలు విడిచాడు. రంగయ్యకు భార్య అనసూయమ్మతో పాటు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆ మహానేత కూతురు షర్మిల మమ్మల్ని పరామర్శించేందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందని అనసూయమ్మ అంటున్నారు. కోడేరు మండలం ఎత్తం గ్రామానికి చెందిన పుట్టపాగ నర్సింహా కూలీ పను లు చేసుకుంటూ హైదారాబాద్‌లో జీవనం సాగించేవాడు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణవార్త విని నర్సింహా జీర్ణించుకోలేకపోయాడు.
ఆ రోజం తా భోజనం కూడా చేయలేదు. సెప్టెంబర్ 3న టీవీలో వైఎస్ మరణవార్తను చూస్తూ గుండెపోటుతో మరణించాడు. అతని భార్య శంకరమ్మ, కొడుకు, కూతురు ఉన్నారు. ప్రస్తుతం వీరు కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొల్లాపూర్ పట్టణంలోని పాతబస్టాండ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న కటిక రాంచందర్ వైఎస్‌కు వీరాభిమాని. వైఎస్ఆర్ మరణవార్త తెలిసి కుంగిపోయాడు. రూ.2కు కిలోబియ్యం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వంటి పథకాలు ఇక ఆగిపోతాయని తన సన్నిహితులతో చెబుతుండేవాడు. 2009 సెప్టెంబర్ 21న టీవీల్లో వైఎస్ఆర్ మరణవార్తలు చూస్తూ గుండెపోటుతో మరణించారు. అతనికి భార్య శంకరబాయి, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇంటిపెద్దదిక్కు చనిపోవడంతో కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది.