‘ప్రతిపక్ష నేత’పై 4లోగా నిర్ణయం
కేంద్రమంత్రి జవదేకర్ వెల్లడి
న్యూఢిల్లీ: కొత్త లోక్‌సభ కొలువుదీరే జూన్ 4లోగా కాంగ్రెస్‌కు ప్రతిపక్ష నేత హోదా మంజూరు అంశంపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ మేరకు నిబంధనలు పరిశీలిస్తున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే చెప్పిం దని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మం త్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. వచ్చే 4లోగా ఈ అంశాన్ని పరిష్కరిస్తామని అన్నారు. మంత్రిగా పార్లమెంట్ హౌస్‌లో శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఎగువసభ (రాజ్యసభ)కు సంబంధించిన వ్యవహారాలను జవదేకర్‌కు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అప్పగించారు.
రాజ్యసభలో ఎన్డీయేకు మెజారిటీ లేకపోవడం, అక్కడ తమ యుద్ధాన్ని కొనసాగిస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియూగాంధీ సంకేతాలిచ్చిన నేపథ్యంలో.. పెద్దల సభలో శాసనపరమైన ఎజెండా ఆమోదం పొందడం కష్టమవుతుందా? అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి పై సమాధానమిచ్చారు. తగిన సంఖ్యా బలం ఉన్నందున కాంగ్రెస్‌కు రాజ్యసభలో ప్రతిపక్ష నేత హోదా దక్కడంలో ఎలాం టి సమస్యా లేనప్పటికీ.. లోక్‌సభకు సంబంధించి మాత్రం అవసరమైన 55 సీట్లకు గాను ఆ పార్టీకి 44 సీట్లు మాత్రమే లభించడంతో ఈ అంశం ప్రశ్నార్ధకమైంది.
ప్రతిపక్ష నేత హోదా కింద ప్రయోజనాలు దక్కాలంటే చట్టపరమైన కొన్ని అవసరతలు ఉండా ల్సి ఉన్నప్పటికీ.. ఏకైక అతిపెద్ద పార్టీ నేతకు లేదా గ్రూపునకు ప్రతిపక్ష నేత హోదా కట్టబెట్టాలని స్పీకర్ భావించినట్టైతే అందుకు న్యాయపరమైన ఆటంకం ఏమీ లేదని నేతలు అభిప్రాయపడుతున్నారు. లోక్‌సభలో విపక్ష నేతగా పార్టీ తరఫునుంచి ఎవరు ఉండాలనేదానిపై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలున్నాయి.